Breaking News

భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ.. 20 మంది చైనా సైనికులకు గాయాలు!


గాల్వన్‌ లోయలో భారత సైనికుల పరాక్రమాన్ని రుచి చూసినప్పటికీ.. చైనా తన బుద్ధిని మార్చుకోలేదు. పైకి శాంతి మంత్రం జపిస్తూ.. సరిహద్దులో భారీగా బలగాలను మోహరిస్తోన్న డ్రాగన్.. మరో తన కపట వైఖరిని బయటపెట్టింది. సిక్కింలోని నాకు లా కనుమ వద్ద భారత భూభాగంలోకి చొరబడేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయి. భారత సైన్యం అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం తలెత్తిన ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారు. ఈ ఘర్షణలో చైనా సైన్యానికి చెందిన 20 మంది, నలుగురు భారత సైనికులు గాయపడ్డారని తెలుస్తోంది. మనదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ.. పరిస్థితి అదుపులోనే ఉందని సమాచారం. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ త్సో, గాల్వాన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్ తదితర ప్రాంతాల్లో భారత్, చైనా సైన్యాల మధ్య స్టాండాఫ్ ప్రారంభం కావడానికి ముందు కూడా నాకు లా కనుమ వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2017లో డోక్లాం వద్ద భారత్, చైనా బలగాలు 73 రోజులపాటు ఎదురెదురు నిలిచాయి. ఇరు దేశాల సైన్యం ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో.. ఓ దశలో యుద్ధం తప్పదేమో అనిపించింది.


By January 25, 2021 at 11:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-china-clash-at-naku-la-in-sikkim-three-days-ago-injuries-reported/articleshow/80444352.cms

No comments