Breaking News

రాజ్యాంగ దినోత్సవం: ఆ మూడు వ్యవస్థలు మూల స్తంభాలైనా రాజ్యాంగమే గొప్పది


దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం పుట్టిన నవంబర్‌ 26ని గుర్తు పెట్టుకోవాలని 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఎల్‌.ఎమ్‌. సింఘ్వికి ఆలోచన వచ్చింది. అదే రోజును న్యాయ దినోత్సవంగా జరుపుకోవాల ని తీర్మానించింది. భారత ప్రభుత్వం 2015లో అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి, ఆ సంవత్సరం నవంబరు 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్‌ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా, రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఈ ఏడాది నవంబరు 26కు 71 ఏళ్లు పూర్తయ్యాయి. వేల సంవత్సరాల నాగరికత ఉన్న భారతావనికి ఈ డెబ్బయి ఏళ్లు గొప్పకాదు కాని, పరాయి పాలన నుంచి విముక్తి పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనం గర్వపడాలి. బ్రిటిషర్ల కబంధహస్తాల నుంచి భారతమాతకు విముక్తి లభిస్తుందని తెలిసిన తరువాత రాజ్యాంగ రచనకి సన్నాహాలు జరిగాయి. ఇందుకు తొలుత రాజ్యాంగ సభను ఏర్పాటుచేయగా.. ఇందులో 15 మంది మహిళలతోపాటు 299 మందిని సభ్యులుగా నియమించారు. బీఎన్‌ రావు రాజ్యాంగ సలహాదారుగా నియమితులు కాగా.. ఈ సభ తొలి సమావేశం 1946 డిసెంబర్‌ 9న జరిగింది. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మొత్తం 299 సభ్యులుండా తుది ప్రతిమీద 284 మంది సంతకం చేశారు. భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సారధిగా కమిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్‌ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. కమిటీలోని ఆరుగురు సభ్యులు మేథోమధనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. 1947 నవంబర్‌ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రూపుదిద్దుకోగా 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం తెలిపింది. అయితే, జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ‘పూర్ణ స్వరాజ్య’దినంగా లేక ‘స్వాతంత్య్ర దినోత్సవం’గా 1930 జనవరి 16న ప్రకటించడమే దీనికి కారణం. 1929లో లాహోర్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెసు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్యం నాటికి మొత్తం 562 స్వదేశీ సంస్థానాలు ఉండగా.. ఎనిమిది మినహా మిగతావి భారతదేశంలో విలీనమయ్యాయి. ఆ ఎనిమిది కూడా 1956లో రాష్ట్రాల పునర్నిర్మాణచట్టం ప్రకారం విలీనమై, మనదేశమంతా పార్లమెంటరీ వ్యవస్థక్రింద వచ్చింది. రాజ్యాంగంలోని పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక బాధ్యతలు ప్రజలకు కవచాలయితే, మిగిలిన విభాగాలు రాజ్యాన్ని తీర్చిదిద్దడానికి కావలసిన మార్గాలు. మన రాజ్యాంగంలో జీవించే హక్కు, చట్టం అందరికీ సమానంగా రక్షణ కల్పించే హక్కు, స్వేచ్ఛ, దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ, ఇష్టమొచ్చిన మతాన్ని అనుసరించే హక్కు, అల్ప సంఖ్యాక వర్గాలకు రక్షణ, ఆ హక్కుల్ని పొందడానికి అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే ప్రత్యేక హక్కు కల్పించబడ్డాయి. అంతేకాదు శాసనాలు చేసేటప్పుడు ఏఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలన్నది కూడా ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. అందరికీ సమానంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించడం ద్వారా ప్రజల సంక్షేమం పెంపొందించాలని, సంపద ఏ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా అందరికీ అందేటట్లు చూడటం, పనివారికి తగిన నిబంధనలు, పని అందేటట్లు, విద్యకు అవకాశం కల్పించడం, వెనుకబడిన వర్గాలకు విద్య, ఆర్థిక పురోభివృద్ధికి అవకాశాలు కల్పించడం, మద్యపానాన్ని నిరోధించి ప్రజల ఆరోగ్య, పౌష్టికాహార స్థితిని మెరుగు పరచడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం వంటివి ముఖ్యమైనవి. అలాగే 1977లో పౌరుల ప్రాథమిక బాధ్యతలను గుర్తుచేస్తూ ఒక అధ్యాయాన్ని చేర్చారు. దేశం, రాష్ట్రాలలో యంత్రాంగాన్ని ముందుకు నడిపించడం కోసం, కార్యనిర్వాహక వర్గం, శాసన, న్యాయ రంగాలు ఎలా ఉండాలి అన్న విషయాలు పొందుపరిచారు. అమెరికా మాదిరిగా మన కార్యనిర్వాహక శాఖ, శాసనస శాఖ వేర్వేరుగా కాకుండా మిళితమై ఉంటాయి. మనది అధ్యక్ష తరహా పాలన కాదు. పార్లమెంట్‌/ శాసనసభలోని సభ్యులే మంత్రులై కార్యనిర్వాహక శాఖ విధుల్ని నిర్వహిస్తారు. ఈ మూడు వ్యవస్థలు తమ పరిధులు దాటి ఇతర శాఖల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. రాజ్యాంగానికి మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థలు ప్రాథమికంగా స్వతంత్రమైనవి కానప్పటికీ ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి. ఈ మూడింటి కంటే రాజ్యాంగమే గొప్పది. రాజ్యాంగం ఏర్పాటుచేసుకున్నప్పుడు న్యాయవ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానంలో ఎనిమిది మంది న్యాయమూర్తులు ఉండేవారు. ఆ సంఖ్య ప్రస్తుతం 33కు పెంచారు. మొత్తం న్యాయరంగం ఎలా ఉండాలన్నది రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇంతే కాకుండా మన దేశ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మదింపు చేయడానికి ఒక ప్రత్యేక అధికారిని (కాగ్), ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్‌ను, న్యాయ సంబంధ విషయాలను చూడడా నికి ఉన్నత న్యాయాధికారిని, అతనికి సహాయకునిగా మరొక అధికారికి రాజ్యాంగంలో స్థానం దక్కింది.


By November 26, 2020 at 07:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/why-we-celebrates-samvidhan-divas-on-november-26-what-is-importance-of-constitution-day-2020/articleshow/79419325.cms

No comments