Breaking News

ఐరాస సెక్రెటరీ జనరల్‌గా రెండోసారి ఆంటోనియో గుటెర్రెస్.. ఏకగ్రీవంగా ఎన్నిక


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియో గుటెర్రస్ మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. వరుసగా రెండోసారి ఆయన సెక్రెటరీ జనరల్‌గా నియమితులయ్యారు. మొత్తం 193 మంది సభ్యులున్న ఐరాస సర్వ ప్రతినిధి సభ ఆంటోనియో గుటెర్రస్‌ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పోర్చుగీస్‌కు చెందిన ఆంటోనియో గుటెర్రస్‌ 2017లో సెక్రెటరీ జనరల్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. జూన్‌ 8న భద్రత మండలి ఏకగ్రీవ తీర్మానం ద్వారా గుటెర్రస్‌ను మరోసారి ఆ పదవిలో కొనసాగించాలని సిఫార్సు చేసింది. భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా తాజా ఎన్నిక జరిగింది. సర్వ ప్రతినిధి సభ అధ్యక్షుడు వోల్కన్‌ బోజ్కర్‌ శుక్రవారం గుటెర్రస్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. సర్వప్రతినిధి సభ వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎటువంటి ఎన్నిక లేకుండా మరోసారి గుటెర్రెస్ ఎన్నికయ్యారని బోజ్కర్ తెలిపారు. ప్రధాన కార్యదర్శి ఎన్నికకు గుటెర్రెస్ ఒక్కరే నామినేషన్ వేశారు. ఐరాస సెక్రెటరీ జనరల్‌ పదవిలో గుటెర్రస్‌ 2026 డిసెంబరు 31 వరకు కొనసాగుతారు. ఐరాస సెక్రటరీ జనరల్‌గా గుటెర్రస్‌ తొలిసారి 2017 జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారం అనంతరం గుటెర్రస్ మాట్లాడుతూ.. ప్రస్తుత భౌగోళిక విభజనలను, వ్యవస్థాగత రాజకీయ శక్తి సంబంధాలను అధిగమించడానికి మేము చేయగలిగిన ప్రతిదాన్ని చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. చాలా అసమానతలు, వైరుద్యాలపై చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘‘ఈ రోజు అపనమ్మకం పరంగా మనం జీవిస్తున్నాం.. అది ఒక అపసవ్యత అని నేను నమ్ముతున్నాను, కానీ అది ప్రమాణికంగా మారదు’’ అని వ్యాఖ్యానించారు. సంప్రదాయంగా సెక్రెటరీ జనరల్ పదవికి పోటీపడే అభ్యర్థులను ఐరాస సభ్యదేశం నామినేట్ చేస్తుంది.. కానీ, 2015లో సాధారణ సభ యూఎన్ చార్టర్‌ తీర్మానం ద్వారా ఆ నిబంధన తప్పనిసరి కాదని పేర్కొన్నారు. ఇక, బాన్ కి మూన్ స్థానంలో 2016 నాటి సెక్రెటరీ జనరల్ ఎన్నికలకు 13 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో ఏడుగురు మహిళలలే కావడం విశేషం.


By June 19, 2021 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/un-unanimously-elected-antonio-guterres-to-a-second-term-as-secretary-general/articleshow/83659035.cms

No comments