Breaking News

ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం.. కిలో అరటి పండ్లు 3,300, కాఫీ ప్యాకెట్ రూ. 7వేలు!


కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా పేద దేశాలు ఆహార, ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర కొరియాలో సంక్షోభం ఏర్పడవచ్చనే ఐరాస నివేదికలు నిజమవుతున్నాయి. దేశంలో పరిస్థితులపై అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తొలిసారి స్పందించారు. రెండు రోజుల కిందట జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కిమ్‌ మాట్లాడుతూ.. ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షోభ నివారణకు ఆహార ఉత్పత్తులను గణనీయంగా పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఆంక్షలు మరికొంతకాలం కొనసాగుతాయని, వాటికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు కిమ్‌ పిలుపునిచ్చారు. కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతుంటే ఉత్తర కొరియా మాత్రం తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదని చెబుతోంది. చైనాలో కోవిడ్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలోనే ఆ దేశంతో సరిహద్దులను మూసివేసింది. ఏడాదిన్నరగా సరిహద్దులను మూసివేయడంతో పాటు కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. చైనాతోనూ వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించడంతో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించినట్లు సమాచారం. దీనికి తోడు గతేడాది అక్కడ సంభవించిన తుఫాన్లు, వరదలతో ఆహారోత్పత్తి దెబ్బతింది. ఆంక్షలు, ప్రకృతి వైపరిత్యాల కారణంగా ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కోనుందని దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇటీవల వెల్లడించింది. దీంతో దేశ ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కొరియాలో ఒక బ్లాక్‌ టీ ప్యాకెట్‌ ధర రూ.5 వేలు, కాఫీ ప్యాకెట్‌ ధర రూ.7 వేలు, కిలో అరటిపండ్ల ధర 3వేలకు పైనే (45డాలర్లు). ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఉత్తర కొరియా దాదాపు 8 లక్షల 60 వేల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం (FAO) అంచనా వేసింది. ఇది ఆ దేశానికి రెండు నెలలపాటు సరిపోయే అహార పదార్థాలతో సమానం. ఇన్నాళ్లూ రసాయన ఎరువుల కోసం చైనాపై ఆధారపడిన ఉత్తర కొరియా.. దిగుమతులపై ఆంక్షల వల్ల తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. దీనికి ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువుల తయారు చేసి, సమస్యను అధిగమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కంపోస్టులో కలిపేందుకు నిత్యం దాదాపు రెండు లీటర్లు మూత్రాన్ని ఇవ్వాలని అక్కడి రైతులకు ఉత్తరకొరియా అధికారులు సూచించినట్టు అమెరికాకు చెందిన రేడియో ఫ్రీ ఆసియా అనే మీడియా గతనెలలో వెల్లడించింది.


By June 19, 2021 at 08:24AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/kim-jong-un-admits-north-korea-facing-a-tense-food-shortage-due-to-covid-and-typhoons/articleshow/83657274.cms

No comments