కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌కు వాలంటీర్ల కొరత.. కారణం ఇదేనంటున్న అధికారులు
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకా కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌లో విచిత్రమైన పరిస్థితి ఎదురయ్యింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు వాలంటీర్ల కొరత ఏర్పడింది. ప్రయోగాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడంలేదు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు అవసరమైన వాలంటీర్లు దొరకడం లేదు. త్వరలోనే కరోనా మహమ్మారిని అంతం చేసే టీకా అందుబాటులోకి వస్తుందన్న భావన నెలకొనడంతో క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి వాలంటీర్లు ఆసక్తి చూపడంలేదని అధికారులు తెలిపారు. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌కు 1500-2,000 మంది వరకు వాలంటీర్లు అవసరం కాగా.. ఇప్పటివరకు 200 మంది మాత్రమే ముందుకు వచ్చినట్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరిస్తున్న ఎయిమ్స్ అధికారి డాక్టర్ సంజయ్ రాయ్ అన్నారు. తొలి దశ ప్రయోగాలకు 100 మంది అవసరమైతే 4,500 మంది ఆసక్తి చూపారని, రెండో దశ ట్రయల్స్‌కు 4వేల దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. టీకా వేయించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. ప్రకటనలు, ఈ మెయిళ్లు, ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సంజయ్ సూచించారు. ‘మొదటి దశలో దరఖాస్తులు వెల్లువెత్తాయి.. 100 మంది పాల్గొనాల్సి ఉంటే 4,500 దరఖాస్తులు వచ్చాయి.. మూడో దశ కోసం వస్తున్న వాలంటీర్లకు ప్రోటోకాల్‌లో భాగంగా అధికారులు స్పష్టంగా చెప్పాల్సి ఉంది.. దీనికి వారు నిరాకరిస్తున్నారు. ఒక వారం లేదా 15 రోజుల్లో దేశంలో టీకా అందుబాటులోకి వస్తుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది.. కాబట్టి కొవాగ్జిన్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదు’ అన్నారు. మరోవైపు, దేశంలో కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తుచేసిన మూడు సంస్థల్లో భారత్ బయోటెక్ ఒకటి. ఐసీఎంఆర్‌తో కలిసి టీకాను అభివృద్ధిచేసిన భారత్ బయోటెక్.. తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రకటించింది. టీకా సురక్షితమైందని, అంతగా దుష్ప్రభావాలు తలెత్తలేదని డాక్టర్ రాయ్ తెలిపారు. కొవాగ్జిన్ రోగనిరోధక ప్రతిస్పందనను కూడా ప్రేరేపించిందని, తొలి దశ ఫలితాల ద్వారా తక్షణ రక్షణను చూపిందని అన్నారు. తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికాగా.. అది టీకా వల్ల కాదని గుర్తించినట్టు పేర్కొన్నారు.
By December 18, 2020 at 08:22AM
No comments