Breaking News

కర్ణాటక: ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుకు మంటలు... ఐదుగురు సజీవదహనం


కర్ణాటకలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుకు మంటలంటుకున్న ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. ట్రావెల్స్ బస్సు విజయపుర నుంచి బెంగళూరుకు వెళ్తుండగా చిత్రదుర్గ జిల్లా హిరయూర్ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాద సమయానికి బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికీలు ఉన్నారు. ప్రమాద మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇంజిన్‌లో లోపం వల్ల మంటలు చెలరేగి, బస్సు మొత్తం వ్యాపించాయని ట్రావెల్స్ యాజమాన్యం పేర్కొంది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని హిరయూర్ ఎస్పీ రాధిక సందర్శించారు. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ట్రావెల్స్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంజిన్‌లో లోపాన్ని గుర్తించకపోవడంతో మంటలు వ్యాపించి ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు.


By August 12, 2020 at 08:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-killed-after-private-bus-catches-fire-in-karnatakas-chitradurga/articleshow/77496562.cms

No comments