Breaking News

సరిహద్దుల్లో చైనాతో అమితుమీకి సిద్ధమైన భారత్.. వెనక్కు తగ్గే ప్రసక్తేలేదు!


భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత నెలకుంది. ఈ నెల తొలివారంలో ఇరు దేశాల సైనికుల మధ్య మొదలైన వివాదం ఘర్షణకు దారితీసి.. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. అప్పటి నుంచి భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు అదనపు బలగాలను తరలించాయి. లడఖ్‌లోని పలు ప్రాంతాల్లో భారత్, చైనాలను సైనికులను మోహరించడంతో సరిహద్దుల్లో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, సరిహద్దు అభివృద్ధి చర్యలను భారత్ ఆపే ప్రసక్తేలేదని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారులు స్పష్టం చేశారు. సరిహద్దుల్లో గుడారాలు, బంకర్లు ఏర్పాటుచేసి ఇరు వర్గాలు సామగ్రి సహా సైనికులను తరలిస్తుండగా.. భారత్ కూడా సుదీర్ఘకాలం నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దౌత్యవర్గాలు, స్థానికస్థాయి సైనిక అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నా.. ఇప్పటి వరకూ ఎలాంటి ఫలితం లేదు. ఈ విషయంలో చైనా స్పందిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆదివారం జరిగిన వార్షిక సమావేశంలో భారత్ గురించి ప్రస్తావించలేదు. శుక్రవారం నుంచి చైనా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో ఇవి ముగిసే వరకూ భారత్-చైనాల మధ్య సరిహద్దు అంశంపై చర్చలు జరిగే అవకాశం లేదు. గాల్వన్ వద్ద నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించిన భారత్.. ధార్చుక్ నుంచి ష్యోక్ మీదుగా దౌలత్ బేగ్ ఓల్డీ వరకు 2019లో రహదారిని నిర్మించింది. ప్రస్తుతం పునరుద్ధరించిన అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఏఎల్‌జీ) ప్రపంచంలోనే ఎత్తైన వైమానితలం. ఇక్కడ సీ -130 జె యుద్ధ విమానాలను సైతం భారత్ మోహరించగలదు. వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యానికి భారీ ప్రాధాన్యత ఇవ్వడం, ఈ రహదారి భారతదేశానికి కరాకోరం హైవేకి ముఖద్వారంగా పనిచేస్తుంది. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సరిహద్దులో చైనాతో మరింత పోరాటానికి భారత్ సిద్ధంగా ఉండాలని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. చైనాతో సరిహద్దు అభివృద్ధి పనులను గత నాలుగేళ్లలో భారత్ మరింత వేగవంతం చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు రహదార్లు, వైమానికతలం నిర్మాణాలు పూర్తికావడంతో అత్యవసర సమయంలో సైనికులను మరింత సులువుగా తరలించడానికి అవకాశం ఏర్పడింది. చైనా దూకుడును మరింత సమర్ధంగా అడ్డుకోడానికి వీలు కల్పించింది. ఎల్‌ఏసీ వద్ద వేసవి ప్రారంభంలో సాధారణంగా ఇరుపక్షాలు తమకున్న అవగాహనలపై పెట్రోలింగ్‌కు ప్రయత్నిస్తాయి. ఈ సమయంలోనే వివాదాస్పద ప్రాంతాల్లో భారత్, చైనాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంటుంది. మే ప్రారంభంలో గాల్వన్, పాంగాంగ్ సరస్సు ఉత్తర భాగంలో అపరష్కృతంగా ఉన్న ప్రాంతాల్లోకి చైనా సైన్యం చొచ్చుకొచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి వివాదం మొదలైంది. ఇది డోక్లాంకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.


By May 25, 2020 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-will-not-stop-its-border-development-activities-in-ladakh-as-standoff-with-china-heads-for-long-haul/articleshow/75962593.cms

No comments