నిప్పుల కొలిమిలా దేశం: ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. జనం బయటకు రావద్దని సూచన
దేశంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 6.00 గంటల నుంచే భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్ హెచ్చరికలు చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతాయని హెచ్చరించింది. ఉత్తర భారతంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండగఢ్, రాజస్థాన్‌లో రాబోయే రెండు రోజులు మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర ప్రదేశ్‌లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్ జారీచేసింది. ఐఎండీ రీజినల్ మెటీరియాలజీ సెంటర్ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. వచ్చే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటి నమోదవుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది వేసవిలో అధిక సంఖ్యలో ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారని అన్నారు. ఉత్తర, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకూ సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ఏప్రిల్, మే మధ్య వరకు వర్షాలు కురవడంతో ఎండలు తీవ్రత అంతగాలేదని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని పిలానీలో అత్యధికంగా ఆదివారం 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు, మరికొన్ని చోట్ల తీవ్రమైన వడగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే, చత్తీస్‌గఢ్, ఒడిశా, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల్లో వచ్చే మూడు నాలుగు రోజులు వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి సాధరణం కంటే 4.5 నుంచి 6.4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయి. వడగాలులు వీచేటప్పుడు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా ఉంటే, తీవ్రమైన వడగాల్పులు వీచే సమయంలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలపైనే ఉంటాయి. రెడ్ వార్నింగ్ జారీచేసిన ప్రాంతాల్లోని ప్రజలు మధ్యాహ్నం 1.00 గంట నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించింది. చత్తీస్‌గఢ్, తమిళనాడు మీదుగా ఉత్తర-పశ్చిమ పొడి గాలుల వీయడం వల్ల తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త హెచ్చరించారు. మే 28 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అన్నారు. మధ్యదరా సముద్ర తీరంలో ఓ తుఫాను ఏర్పడి, మధ్య ఆసియా అంతటా ప్రయాణిస్తుందని, ఇది హిమాలయాలకు సమీపంగా వచ్చినప్పుడు, కొండ, మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
By May 25, 2020 at 09:02AM
No comments