Breaking News

పింఛన్ డబ్బు కోసం కన్న తండ్రిని చంపిన కసాయి


కొడుకు తల్లిదండ్రుల్ని పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటారు. ఈ కొడుకు మాత్రం రివర్స్.. తండ్రిని పున్నామ నరకానికి పంపాడు. పింఛన్ డబ్బుల కోసం క్రూరంగా చంపేశాడు. గొంతు నులిమి, దారుణంగా దాడి చేశాడు.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆ తండ్రి కన్నుమూశాడు. చందర్లపాడులో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. తండ్రిని కొడుకు చంపేందుకు ప్రయత్నిస్తుండగా.. కుటుంబ సభ్యులు వీడియో తీయడంతో ఈ దారుణం బయటపడింది. చందర్లపాడుకు చెందిన షేక్ మహబూబ్ సాహెబ్ ఈ నెల 8న ఫించన్ తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. తండ్రికి ఫించన్ డబ్బు వచ్చిందని తెలుసుకున్న కుమారుడు శిలార్.. తండ్రితో గొడవకు దిగాడు. ఆ డబ్బు ఇవ్వాలని తండ్రిని ఒత్తిడి చేశాడు. మహబూబ్ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో.. తండ్రిపై శిలార్ దాడి చేశాడు. పిడిగుద్దులు కురిపిస్తూ గొంతును నులిమే ప్రయత్నం చేశాడు. తండ్రీ-కొడుకుల మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. వెంటనే శిలార్ తండ్రిని చేతులతో ఎత్తుకెళ్లి ఇంటి బయట పడేసే ప్రయత్నం చేశాడు. అది కుదరకపోవడంతో మళ్లీ ఇంట్లోకి తీసుకొచ్చి చంపే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వారించినా వినిపించుకోలేదు. తర్వాత స్థానికులంతా రావడంతో.. తండ్రిని అక్కడే వదిలేశాడు. శిలార్ చేతిలో గాయపడ్డ మహబూబ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


By July 12, 2019 at 11:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/drunk-man-kills-father-for-pension-money-in-krishna-district/articleshow/70187760.cms

No comments