Breaking News

Bangladesh Liberation war భారత్ ముప్పేట దాడితో పాక్ కకావికలం.. ఆ విజయానికి 50 ఏళ్లు


తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)ను పశ్చిమ పాక్ పాలకులు చిన్నచూపుచూడటం.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అవామీ లీగ్ నేత ముజిబూర్ రెహమాన్‌కి అధికారం అప్పగించకుండా సైనిక ప్రభుత్వం అరెస్ట్ చేయడం.. దీనిపై నిరసన తెలిపిన ప్రజల మీద ఉక్కుపాదం మోపి అణచివేతకు గురి చేయడంతో తిరుగుబాటు మొదలయ్యింది. ముక్తివాహిని పేరిట గెరిల్లా పోరాటానికి దిగారు. అప్పుడు సైన్యం తన అరాచకాన్ని మరింత పెంచడంతో వేలాది మంది శరణార్ధులుగా భారత్‌లో ప్రవేశించసాగారు. పశ్చిమ, తూర్పు పాకిస్థాన్‌ ప్రజల భాషలు, సంస్కృతి వేర్వేరు. పశ్చిమ పాకిస్థాన్‌లో ఉర్దూ మాట్లాడితే.. తూర్పు పాకిస్థాన్‌లో బెంగాలీలు అధికం. అయితే, 1948లో నాటి గవర్నర్‌ జనరల్‌ మహ్మదాలీ జిన్నా రెండు చోట్లా ఉర్దూయే అధికార భాషగా ఉండాలని ఆదేశించారు. సహజంగా భాషాప్రియులైన బెంగాలీలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో బెంగాలీనే అమలు చేయాలని ఉద్యమం ప్రారంభించారు. పశ్చిమ పాక్‌ పాలకుల పెత్తనం పెరగడంతో 1964, 69ల్లో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. పాక్‌ సైన్యాలు బెంగాలీలపై అకృత్యాలు సాగించాయి. ఈ సమయంలోనే 1970లో తూర్పు తొలిసారి సాధారణ ఎన్నికలు నిర్వహించగా.. మొత్తం 300 స్థానాలకుగానూ షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ సారథ్యంలోని అవామీలీగ్‌ 160 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది. అయితే పశ్చిమ పాక్ నాయకులదే పెత్తనం కావడంతో.. ముజిబుర్‌ రహమాన్‌కు ప్రధాని పదవి కట్టబెట్టేందుకు అంగీకరించలేదు. ఎన్నికల్లో గెలిచినా తూర్పు ప్రాంత పార్టీకి అధికారం అప్పగించకపోవడంతో.. తూర్పు పాక్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. ఇదే సమయంలో పశ్చిమ పాక్‌ను బిహారీ ముస్లింలు సమర్ధించడం బెంగాలీ అసమ్మతివాదులకు రుచించలేదు. 1971 మార్చిలో చిట్టగాంగ్‌లో పెద్దఎత్తున అల్లర్లు రెచ్చగొట్టి.. 300 మంది బిహారీలను హత్య చేశారు. బిహారీల ఊచకోత నెపంతో యాహ్యాఖాన్‌ పాక్‌ బలగాలను పెద్ద సంఖ్యలో ఢాకాకు తరలించారు. ‘బుచర్‌ ఆఫ్‌ బెంగాల్‌’ లెఫ్టినెంట్‌ జనరల్‌ టిక్కా ఖాన్‌ మార్చి 25న బెంగాలీలపై నరమేధానికి పూనుకున్నాడు. ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌ పేరిట ఇళ్లకు నిప్పుపెట్టడం, విశ్వవిద్యాలయాలు, కాలేజీలపై పడి విద్యార్థులను హత్య చేయించి, విద్యార్థినులపై అత్యాచారాలకు తెగబడ్డారు. ముజిబుర్‌ రహమాన్‌ తరఫున తూర్పు బెంగాల్‌కు స్వాతంత్య్రం ప్రకటిస్తున్నట్లు మేజర్‌ జియావుర్‌ రహ్మాన్‌ చేసిన ప్రకటనతో సైనికులు మరింత రెచ్చిపోయి..అణచివేతను తీవ్రతరం చేశారు. తిరుగుబాటుదారులను పెద్దసంఖ్యలో అరెస్టు చేసి... మైనారిటీ హిందువులను ఊచకోత కోశారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది శరణార్థులు భారత్‌లోకి ప్రవేశించారు. భారత్‌లో ఆశ్రయం పొందిన అవామీలీగ్‌ నేతలు మెహెర్‌పూర్‌లోని బైద్యనాథ్‌తాలాలో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పాక్‌ బలగాల్లో పనిచేస్తున్న ఈస్ట్‌ పాకిస్థాన్‌ రైఫిల్స్‌, బెంగాలీ అధికారులు సైన్యాన్ని వదిలి భారత్‌కు పారిపోయి వచ్చారు. ఆ తర్వాత విప్లవకారులుగా మారడంతో ‘బంగ్లా ముక్తివాహిని’ ఆవిర్భవించింది. ముక్తివాహిని దళాలకు ఆయుధ సహాయం చేస్తూ వచ్చిన భారత్ నేరుగా యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. తూర్పు బెంగాల్లో హింస నానాటికీ తీవ్రమవుతుండడంతో.. సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ప్రపంచ దేశాలకు నాటి భారత ప్రధాని ఇందిర పదే విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అయినా అమెరికా, సోవియట్‌ యూనియన్‌, చైనా, ముస్లిం దేశాలు సహా ఏ దేశం ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో 1971 మార్చి 27న తూర్పు బెంగాలీల స్వాతంత్య్ర ఉద్యమానికి ఇందిరాగాంధీ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత మంత్రివర్గంతో చర్చించి పాకిస్థాన్‌తో యుద్ధంచేసి తూర్పు బెంగాల్‌కు విముక్తి కల్పించడం మంచిదని నిశ్చయానికి వచ్చారు. 1971 ఏప్రిల్‌ 28న జనరల్‌ శామ్‌ మానెక్‌ షాను పిలిపించి మాట్లాడారు. ఆయన కొంత సమయం అడిగితే.. ఇందిర అంగీకరించారు. పాక్‌లో అధ్యక్షుడు యాహ్యాఖాన్‌ నవంబరు 23న ఎమర్జెన్సీ విధించారు. యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. 1971 డిసెంబరు 3న సాయంత్రం 5.40 గంటకు ఆపరేషన్ చంఘీజ్ ఖాన్ పేరుతో పాక్ యుద్ధవిమానాలు ఆగ్రా సహా 11 వైమానిక స్థావరాలపై దాడులు చేశాయి. అయితే, దీనికి భారత్ కొద్ది గంటల్లోనే ప్రతీకారం తీర్చుకుంది. అదేరోజు రాత్రి భారత్‌ వాయుసేన మెరుపు దాడులు చేసింది. డిసెంబరు 4,5తేదీల్లో కరాచీ రేవుపై భారత నౌకాదళం తీవ్రస్థాయిలో దాడిచేసింది. యుద్ధనౌకలతో పాటు పలు వాణిజ్య నౌకలను, చమురు డిపోలను పూర్తిగా ధ్వంసం చేసింది. పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ను భారత వాయుసేన పూర్తిగా కట్టడి చేసింది. తదనంతరం భారత పదాతిదళాలు పాక్‌ భూభాగంలోకి ప్రవేశించాయి. 5,795 చదరపు మైళ్ల మేర ఆక్రమించాయి. భారత సైన్యం దెబ్బకు తూర్పు బెంగాల్లోని పాక్‌ పైలట్లు, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది పలాయనం చిత్తగించడంతో ఆ ప్రాంతం మొత్తాన్నీ భారత్ తన అధీనంలోకి తీసుకుంది. డిసెంబరు 16న మన సైనిక బలగాలు ఢాకాను చుట్టుముట్టి అరగంటలో లొంగిపోకుంటే దాడులు తప్పవని హెచ్చరించాయి. దీంతో పాక్‌ సైన్యాధికారులు గత్యంతరలేని పరిస్థితుల్లో లొంగిపోయారు. ఎలాంటి ప్రతిఘటనా లేకుండా పాక్‌ ఈస్ట్‌ కమాండ్‌ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏఏకే నియాజీ, ఆయన సహాయకుడు వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ ఖాన్‌ తమ సైన్యంతో లొంగిపోయారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ అరోరాతో కలిసి పత్రాలపై అదే రోజు సాయంత్రం 4.31 గంటలకు సంతకాలు చేశారు. ఆ రోజున పాక్‌ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించింది. దీంతో 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో 8,000 మంది పాక్ సైనికులు హతమవ్వగా.. 25 వేల మంది గాయపడ్డారు. భారత్‌కు కూడా భారీగా ప్రాణనష్టం వాటిళ్లింది. 3 వేల మంది మరణించగా.. 12 వేల మంది క్షతగాత్రులయ్యారు. 93 వేల మంది పాక్‌ సైనికులు యుద్ధఖైదీలుగా పట్టుబడటంతో దాయాది కాళ్లబేరానికి వచ్చింది. దీని ఫలితంగానే 1972 జూలైలో సిమ్లా ఒప్పందం కుదిరింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంత పెద్ద సంఖ్యలో ఓ దేశ సైన్యం అతిపెద్ద లొంగుబాటు ఇదే కావడం గమనార్హం. 1971 యుద్ధ సమయానికి పాకిస్థాన్‌ అధ్యక్షుడుగా ఉన్న యాహ్యాఖాన్‌.. దేశ విభజన సమయంలో బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో కల్నల్‌ స్థాయిలో ఉండేవాడు. ఈయన జనరల్ శామ్ మానెక్‌ షాకు స్నేహితుడు. దేశ విభజన అనంతరం యాహ్యాఖాన్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ పాక్ అధ్యక్షుడై భారత్‌‌తో యుద్ధానికి కాలు దువ్వారు. యుద్దంలో విజయం తర్వాత యాహ్యాఖాన్‌ గురించి మానెక్ షా ఆసక్తికర విషయం వెల్లడించారు. అప్పట్లో మానెక్‌ షా వద్ద ఉన్న జేమ్స్‌ మోటార్‌ సైకిల్‌‌ను చూసి ముచ్చటపడ్డ నాటి కల్నల్‌ యాహ్యాఖాన్‌ తనకు ఇవ్వాలని కోరాడు. అప్పట్లో దాని ఖరీదు రూ.1400 కాగా.. ‘సరే, నువ్వు ఇవ్వగలిగినంత ఇచ్చి తీసుకో’ మానెక్‌ షా అన్నారు. రూ.వెయ్యి ఇస్తానని చెప్పి బైక్‌ తీసుకున్న యాహ్యాఖాన్‌.. ఆ డబ్బులు తర్వాత పంపుతానని చెప్పాడు. ఆరోజు 1947 ఆగస్టు 13 కాగా.. దేశ విభజన జరిగి యాహ్యాఖాన్‌ పాక్‌కు వెళ్లిపోయాడు. ఈ విషయాలను వెల్లడించిన మానెక్‌ షా.. ‘‘యాహ్యాఖాన్‌ నుంచి నాకు రూ.1000 అందలేదుగానీ.. మొత్తం తూర్పుపాకిస్థాన్‌ను నాకు ఇచ్చాడతను.’’ అని వ్యాఖ్యానించారు.


By December 16, 2021 at 10:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/50-years-of-india-pakistan-1971-war-and-how-indian-forces-helps-bangladesh-liberation-fight/articleshow/88311921.cms

No comments