Breaking News

Kashmir పీఓకేలో చైనా రహస్య సర్వే.. దాయాది కుట్రలకు డ్రాగన్ సాయం!


చైనా, పాకిస్థాన్‌లతో భారత సైన్యం ఏకకాలంలో యుద్దం చేయాల్సి ఉంటుందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నట్టుగానే.. ఇటీవల చోటు చేసుకొంటున్న పరిణామాలు అందుకు బలం చేకూర్చుతున్నాయి. పాకిస్థాన్‌కు చైనా నుంచి ఆర్ధిక సాయంతో పాటు సైనిక సహకారం కూడా పెరుగుతోంది. ఇటీవలే అత్యాధునిక ఫ్రిగేట్‌ను పాకిస్థాన్‌కు చైనా అందజేసింది. తాజాగా, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (CPLA) కదలికలు పెరుగుతున్నట్టు నివేదికలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సిబ్బంది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లోని సరిహద్దు చెక్‌పోస్టులు, గ్రామాల్లో రహస్య సర్వే నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాలను భారత దళాలు నిశితంగా గమనిస్తున్నాయి. దాదాపు 40 మందికిపైగా చైనా సైనికులను నీలం వ్యాలీ, కెల్‌, జురా, లీపా సెక్టార్లలో నెల రోజుల క్రితం గుర్తించినట్టు పేర్కొన్నాయి. వారు ఐదు నుంచి ఆరుగురు సభ్యుల బృందాలుగా విడిపోయి పీవోకేలోని పలు గ్రామాలను సందర్శించినట్టు తెలిపాయి. చైనా సైన్యం సర్వే నిర్వహించిన కెల్, జురా, లీపా సెక్టార్ల నుంచే భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాటుకు పాకిస్థాన్ సైన్యం సహకరిస్తోంది. పాక్ సైనిక పోస్టులు, కశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడే మార్గాలలో సాగినట్టు సమాచారం. వీరికి పాకిస్థాన్ సైనికాధికారులు, గూఢచారి సంస్థ ఐఎస్ఐ సిబ్బంది కూడా సహకరించారని వివరించాయి. ఈ సందర్భంగా అక్కడ అత్యాధునిక గ్రామాలను నిర్మించేందుకు ఆసక్తి చూపారని, వీటిని సైనిక, పౌర అవసరాలకు వినియోగించుకోవాలని భావిస్తున్నారని పేర్కొన్నాయి. కాగా, ఇటువంటి గ్రామాన్నే అరుణాచల్‌ సరిహద్దుల్లో వివాదాస్పద ప్రదేశంలో చైనా నిర్మించిన విషయం తెలిసిందే. భారత్‌‌తో సరిహద్దు బాధ్యతలను చైనా పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ నిర్వహిస్తుంది. దీనికి కమాండర్‌గా ఇటీవలే వాంగ్‌ హెజాంగ్‌ను నియమించారు. అలాగే, చైనా సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌లోని జాయింట్‌ స్టాఫ్‌ డిపార్ట్‌మెంట్‌లో పాకిస్థాన్‌కు చెందిన కర్నల్‌ ర్యాంక్‌ అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు సేకరించే ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని పంచుకోవడానికి వీలుగా ఈ నియామకం జరిగింది. చైనా సైన్యం దాడులకు శిక్షణ, ప్లానింగ్‌, వ్యూహరచన బాధ్యత సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ చూసుకుంటుంది. దీంతోపాటు చైనాలోని పాకిస్థాన్‌ దౌత్యకార్యాలయంలో దాదాపు 10 మంది పాక్‌ సైనిక అధికారులను ‘డిఫెన్స్‌ అటాచీ’లుగా నియమించింది. వీరు చైనా నుంచి ఆయుధ సమీకరణకు పాక్‌కు సహకరిస్తారు. చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (CPEC) భద్రత కోసం 9,000 మంది సైనికులు, 6,000 మంది పారామిలటరీ సిబ్బందితో ఓ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసినట్లు డాన్‌ పత్రిక 2016లో వెల్లడించింది. సీపెక్‌ , చైనా ఉద్యోగుల రక్షణ నిమిత్తం డివిజన్‌ స్థాయిలో భద్రతా దళాన్ని ఏర్పాటు చేస్తామని పాక్‌ 2019లో పేర్కొంది.


By November 12, 2021 at 07:25AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-carrying-survey-villages-and-military-posts-in-pakistan-occupied-kashmir/articleshow/87657411.cms

No comments