Breaking News

రిక్షావాలాకు కోటి రూపాయల ఆస్తిని రాసిచ్చిన మహిళ...!


జీవితంలో అద్భుతాలు జరగిపోవాలని చాలా మంది ఆశిస్తారు. కానీ, అతి కొద్ది మంది జీవితాల్లోనే ఆ అద్భుతాలు జరుగుతాయి. ఈ కూడా ఇప్పుడు ఈ కోవకే చెందుతారు. ఒడిశాకు చెందిన ఓ మహిళ తన యావత్ ఆస్తిని ఇప్పుడు ఇతడి పేరు మీద రాసేశారు. కోటి రూపాయల విలువైన ఆస్తికి యజమానిని చేసేశారు. తన బంగారు నగలను కూడా ఆ రిక్షావాలా కుటుంబానికి ఇచ్చేశారు. అలాగని.. ఇదేదో రాత్రికి రాత్రే జరిగింది కాదు. 25 ఏళ్లుగా ఆ కుటుంబానికి విధేయుడిగా, నిజాయతీగా సేవలు అందిస్తున్నందుకు అతడికి దక్కిన ఫలితం. ఒడిశాలోని కటక్‌కు చెందిన మినాటి పట్నాయక్ వయసు 63 ఏళ్లు. సాఫీగా నడుస్తున్న వీరి కుటుంబంలో ఏడాది కిందట విధి చిచ్చుపెట్టింది. ఆమె భర్త కిడ్నీ ఫెయిలై మరణించారు. ఆ తర్వాత ఒక్కగానొక్క కూతురితో కలిసి జీవిస్తున్నారు. కొన్ని రోజుల కిందట గుండె పోటు రూపంలో మృత్యువు ఆ కుమార్తెను కూడా తీసుకెళ్లిపోయింది. దీంతో ఆమె ఒంటరి వారయ్యారు. వయసు మీద పడిన మినాటిని ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. తన తర్వాత తమ ఆస్తి ఎవరికి చెందాలి. దీనికి ఆమె తేలిగ్గానే సమాధానం వెతుక్కున్నారు. మరో ఆలోచన లేకుండా రిక్షావాలా బుద్ధా సామల్ పేరున యావత్ ఆస్తిని రాసేశారు. మినాటి ఈ నిర్ణయం తీసుకునే ముందు కొంత మంది దగ్గరి బంధువులతో తన ఆలోచన పంచుకున్నారు. మినాటి నిర్ణయాన్ని ఆమె ఇద్దరు చెల్లెళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా, ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే.. ఆ చెల్లెళ్లు, తన తోబుట్టువులందరికీ డబ్బు, ఆస్తి పరంగా ఎలాంటి కొరతా లేదు. అందుకే తన ఆస్తిని ఓ పేద కుటుంబానికి రాసివ్వాలని నిర్ణయించుకున్నారు. పైగా ఆ పెద్దావిడ ఏమంటున్నారో తెలుసా.. ‘నా ఆస్తిని ఆ కుటుంబానికి ఇవ్వడం ద్వారా నేనేదో వాళ్లకు గొప్ప మేలు చేశానని అనుకోవట్లేదు. అతడికి ఆ అర్హత ఉంది. 25 ఏళ్లుగా నా కుటుంబానికి సేవ చేస్తున్నారు. నా కుమార్తెను రోజూ స్కూల్‌కు, కాలేజీకి సామల్ తన రిక్షాలోనే తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడు. నా కుటుంబం పట్ల వాళ్లకున్న విధేయత, నాకు వాళ్ల మీద ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని మినాటి చెప్పుకొచ్చారు. అంతేకాదు.. భర్త, కూతురిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న తన బాగోగులను బంధువులెవరూ పట్టించుకోలేదట. రిక్షావాలా బుద్ధా సామల్ కుటుంబం మాత్రం ఒంటరిగా ఉంటున్న తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారట. తన మరణం తర్వాత ఆస్తి విషయంలో అతడిని ఎవరూ ఇబ్బందికి గురి చేయకుండా తగిన న్యాయ ప్రక్రియలన్నీ పకడ్బందీగా పూర్తి చేస్తున్నారు మినాటి. మినాటి పట్నాయక్ నిర్ణయం గురించి వినగానే రిక్షావాలా సామల్‌ ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే.. ఇప్పుడు అతడు తన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె.. అందరూ కలిసి, ఏ బాధా లేకుండా ఒకే గొడుగు నీడన నివసించొచ్చని భావిస్తున్నాడు. మినాటి మరణించే వరకు ఆమెకు సేవ చేస్తూనే ఉంటానని అతడు తెలిపాడు.


By November 16, 2021 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/odisha-woman-minati-patnaik-donates-properties-worth-rs-1-crore-to-rickshaw-puller/articleshow/87729051.cms

No comments