Breaking News

కేరళలో మరో కొత్తరకం వైరస్ కలకలం.. 13 మందికి ‘నోరో’ పాజిటివ్


ఇప్పటికే కరోనా మహమ్మారితో కేరళ అల్లాడుతుండగా... కొత్తగా మరో వైరస్ బయటపడటం కలకలం రేగుతోంది. కేరళలో అరుదైన నోరో వైరస్‌ కేసులు నిర్ధారణయ్యాయి. వయనాడ్‌ జిల్లా పోకోడ్‌లోని ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులు నోరో వైరస్ బారిన పడ్డారు. కాలేజీ బయట, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల్లో తొలుత ఈ వైరస్‌ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. విద్యార్థుల రక్త నమూనాలను అలప్పుజాలోని జాతీయ వైరాలజీ సంస్థ (NIV)కు పంపి పరీక్షించగా పలువురిలో పాజిటివ్ వచ్చింది. చాలా సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. నోరో వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత వెటర్నరీ కాలేజీ విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారికి ప్రత్యేక అవగాహన తరగతిని కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి శుక్రవారం అధికారులతో సమావేశమై వయనాడ్‌లో పరిస్థితిని సమీక్షించారు. తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు బాధితులకు తగిన చికిత్స అందించడం వంటి చర్యల ద్వారా వ్యాధి త్వరలోనే అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు. జంతువుల్లో పుట్టే ఈ వైరస్.. నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ, అందరూ అప్రమత్తంగా ఉండాలి. నీటిని ఎక్కువగా క్లోరినేషన్ చేయడం సహా నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి’ అని మంత్రి వీణా జార్జ్ అన్నారు. తగిన చికిత్స, నివారణ ద్వారా నోరో వైరస్‌ను నియంత్రించవచ్చని, దీని గురించి ప్రతి ఒక్కళ్లూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. వైరస్ సోకినవారు తగినంత విశ్రాంతి తీసుకుని, ఓఆర్ఎస్ ద్రావణం, కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి.


By November 13, 2021 at 07:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/norovirus-confirmed-in-wayanad-veternary-college-of-kerala/articleshow/87677102.cms

No comments