సోమవారం తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం.. రోజుకు 30 వేల మందికి దర్శనం
ఈ ఏడాది మండల-మకరువిళక్కు పూజల కోసం శబరిమల నవంబరు 15న తెరుచుకోనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. రెండు నెలల పాటు ఆలయాన్ని భక్తులు సందర్శించుకోనున్నారు. మండల మకరవిళక్కు సీజన్ సందర్భంగా రోజుకు 30వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. నవంబరు 15న సాయంత్రం 5 గంటలకు సన్నిధానం తెరిచి, 16 ఉదయం నుంచి భక్తులను దర్శనానికి అనుమతినిస్తారు. డిసెంబరు 26న మండలపూజ ముగుస్తుంది. మూడు రోజుల అనంతరం తిరిగి డిసెంబరు 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2022 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న పడిపూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. కఠినమైన కరోనా నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. రెండు డోస్‌లు వ్యాక్సిన్ వేసుకున్నట్టు సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ పరీక్ష రిపోర్ట్ ఉన్నవారినే దర్శనానికి అనుమతించనున్నట్టు స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో గతేడాది తొలుత 1,000 మంది భక్తులను అనుమతించగా... క్రమంగా దానిని 5,000కు పెంచారు. అయితే, ఈ ఏడాది మండల-మకరవిళక్కు సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శనానికి ప్రారంభంలో రోజుకు 25 వేల మందిని అనుమతించి, క్రమంగా 30,000కు పెంచనున్నారు. వర్చువల్ క్యూ సిస్టమ్ కొనసాగుతుందని అధికారులు వివరించారు. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడినవారిని కూడా శబరిమలలోకి అనుమతిస్తారు. నెయ్యాభిషేకానికి కూడా అవకాశం కల్పిస్తారు. అయితే, భక్తుల వాహనాలను నీలక్కల్ వరకు మాత్రమే అనుమతిస్తామని, అక్కడి నుంచి పంపా నదికి కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నారు. పంబలో స్నానానికి కూడా అనుమతించారు. సోమవారం ప్రధాన మహేశ్ మోహనారు సమక్షంలో ఈ ఏడాది మేల్‌సంతిగా ఎంపికైన మాదమ్ ఎన్ పరమేశ్వరన్ నంబూద్రీ ఆలయాన్ని తెరిచి దీపాలు వెలిగిస్తారు. మాలికాపురత్తమ్మ ఆలయ పూజారిగా కురువక్కడ్ శంభు నంబూద్రీ ఎంపికయ్యారు.
By November 13, 2021 at 08:24AM
No comments