చట్ పూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 10 మంది భక్తులు మృతి
అసోంలోని గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాం సంభవించింది. కరీమ్గంజ్ జిల్లాలో ఆటోను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. చట్ పూజల్లో పాల్గొని తిరిగి స్వస్థలాలకు వెళుతుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. త్రిపుర సరిహద్దుల సమీపంలోని ఎనిమిదో నెంబరు జాతీయ రహదారి వద్ద వేగంగా వచ్చిన ట్రక్కు టీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. అత్యంత వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. మృతులు చట్ పూజలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం వాటిని తరలించారు. పరారైన ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని తెలిపారు. ప్రమాద సమయానికి ఆటోలో పది మంది ఉన్నారని పేర్కొన్నారు.
By November 11, 2021 at 11:35AM
No comments