క్విట్ ఇండియా.. ప్రజలే నాయకులుగా ముందుండి నడిపిన తుది స్వాతంత్ర పోరాటం
బ్రిటిషర్ల వలస పాలనకు చరమగీతం పాడి.. భారతమాతకు దాస్యశృంఖాల నుంచి విముక్తి కలిగించి.. జాతీయోద్యమంలో కీలక ఘట్టంగా మిగిలిపోయింది క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8న విజయమో వీరస్వర్గమో అంటూ మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపునకు ఉత్తేజితులైన భారతీయులు ఆ మర్నాడు (ఆగస్టు 9) నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. అయిదేళ్ల తిరిగేసరికల్లా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. క్విట్ ఇండియా అంటూ బ్రిటిష్ పాలకులపై గాంధీజీ చేసిన గర్జన ప్రజల్లో పూర్ణ స్వరాజ్యం సాధించాలన్న ఆకాంక్షను బలంగా చాటింది. ఇదే స్వాతంత్య్ర ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. అంతవరకు భారతదేశాన్ని తమ కబంధహస్తాల కిందట పాలించిన బ్రిటిషర్ల బింకాన్ని సడలించిన ఘనత క్విట్ ఇండియా ఉద్యమానిదే. రవి అస్తమించని సామ్రాజ్యంగా చెంకలు గుద్దుకున్న ఆంగ్లేయులకు రెండో ప్రపంచ యుద్ధంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. 1939లో హిట్లర్ ప్రారంభించిన ఈ యుద్ధంలో ఐరోపాలోని బ్రిటిష్ సేనలు మట్టికరిచాయి. బ్రిటిష్ వారు ప్రాణాలు అరచేతులో పెట్టుకుని ఫ్రాన్స్‌లోని డన్ కర్క్ నుంచి నౌకల్లో స్వదేశానికి పరారయ్యారు. తూర్పు నుంచి జపాన్ గండం ముంచుకొచ్చింది. ఆసియాలో బ్రిటిష్ సామ్రాజ్య అంతర్భాగాలైన మలయా, సింగపూర్, ఇండోనేసియా, పాపువా న్యూగినియా, బర్మాల నుంచి బ్రిటిష్ సేనలను పారదోలిన తరవాత ఈశాన్య భారత్ పొలిమేరల దాకా జపాన్ దూసుకొచ్చింది. ఈ పోరులో బ్రిటిష్ వారికి భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇక చేతుల్లో ఉన్న భారతదేశాన్ని జపాన్ హస్తగతం చేసుకుంటుందనే భయం బ్రిటిషర్లు వెంటాడింది. మరోవైపు హిట్లర్ దాడులతో భయాందోళనలు పెరిగాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల నుంచి ముప్పేట దాడితో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరవడం గమనించిన భారతీయులు, తెల్లవాడు అజేయుడు కాడని గ్రహించారు. ఆసియాలో జపాన్ దూకుడును అడ్డుకోవడానికి భారతీయుల మనఃపూర్వక సహకారం కోరాలని బ్రిటన్‌కు మిత్రరాజ్యాలు సలహా ఇచ్చాయి. ఈ మాటలు వింటున్నట్టే నటించిన వినిస్టెంట్ చర్చిల్.. భారతీయుల పట్ల తనకున్న హేయభావాన్ని కాసేపు పక్కనపెట్టారు. కాంగ్రెస్, ముస్లింలీగ్‌లతో రాయబారానికి 1942 మార్చిలో లేబర్ పార్టీ నేత సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నాయకత్వంలో ప్రతినిధులను భారత్‌కు పంపారు. రెండో ప్రపంచ యుద్ధంలో తమకు సహకరిస్తే భారతదేశానికి సాధ్యమైనంత త్వరగా స్వయంపాలనను అందిస్తామని హామీ ఇచ్చి, చివరకు పూర్తి స్వరాజ్యం కాకుండా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా డొమినియన్ ప్రతిపత్తి ఇస్తామంటూ బేరం పెట్టింది. బ్రిటిష్ రాణికి విధేయమై ఉండాలని షరతు పెట్టింది. భారత్ నుంచి విడిపోదలచిన రాష్ట్రాలకు ఆ స్వేచ్ఛను ఇస్తామని ప్రతిపాదించింది. క్రిప్స్ రాయబారాన్ని కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో 1942 జులైలో వార్ధాలో సమావేశమైన కాంగ్రెస్ కార్యవర్గం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని తీర్మానించింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్‌తో సహా యావత్ కాంగ్రెస్ నాయకత్వాన్ని జైలు పంపింది. కాంగ్రెస్‌ను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించి, దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడింది. దీంతో నాయకుల ఆదేశాలు, సూచనలతో పనిలేకుండా ప్రజలే స్వయంగా ఉద్యమం ప్రారంభించారు. రెండో ప్రపంచ యుద్ధం వల్ల ధరలు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజల అసంతృఫ్తి, ఆగ్రహావేశాలు క్విట్ ఇండియా ఉద్యమంలో అగ్ని పర్వతంలా ప్రజ్వరిల్లాయి. బొంబాయి గోవాలియా ట్యాంక్ మైదానంలో 1942 ఆగస్టు 8న కాంగ్రెస్ స్వరాజ్యం తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో బ్రిటిష్ వారిని భారత్ ఛోడో (క్విట్ ఇండియా) అంటూ గద్దిస్తూ, భారతీయులు స్వాతంత్య్రం కోసం విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాడాలని గాంధీజీ పిలుపు ఇచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అన్ని వర్గాలూ పాలుపంచుకోవాలన్నారు. ప్రభుత్వోద్యోగులు బాహాటంగా కాంగ్రెస్ పార్టీకి విధేయత ప్రకటించాలన్నారు. సైనికులు తమ సొంత ప్రజలపై కాల్పులు జరపడానికి నిరాకరించాలనీ, సంస్థానాధీశులు విదేశీ పాలకులకు తలొగ్గడం కాకుండా తమ ప్రజల సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని మహాత్ముడు కోరారు. 1942 ఆగస్టు 9న బొంబాయి, పుణె, అహ్మదాబాద్‌లలో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణలకు దిగారు. మర్నాడు ఆగస్టు 10 ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లలో నిరసనలు పెల్లుబికాయి. కాన్పుర్, పాట్నా, వారణాసి, అలహాబాద్‌లలో ప్రజలు హర్తాళ్లు, ప్రదర్శనలు జరిపారు. తరవాత దేశమంతటా పల్లెలు, పట్టణాలకు ఉద్యమం వ్యాపించింది. ప్రజలు స్వచ్ఛందంగా సత్యాగ్రహాలు చేశారు. సెప్టెంబరు మధ్యనాటికల్లా పోలీసు స్టేషన్లు, కోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగాయి. నగరాల్లో ఫ్యాక్టరీ కార్మికులు విధులకు దూరంగా ఉండిపోయారు. విద్యార్థులు పాఠశాలలను, కళాశాలలను వదలి ఉద్యమంలో మమేకమయ్యారు. దక్షిణ భారతంలో కూడా ఉద్యమం ఉద్ధృత రూపం ధరించింది. దీంతో పోలీసులు, సైనికులు ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. జనసమూహాలపై యుద్ధ విమానాలు, మరతుపాకులతో కాల్పులు జరిపారు. 1942 ఆగస్టు నుంచి డిసెంబరు వరకు వేలమందిని జైళ్లలోకి నెట్టారు. బ్రిటిష్ వలస పాలకులు ఎంతగా దమననీతి పాటించినా, సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలన్న భారతీయుల దృఢ సంకల్పం చెదరలేదు.
By August 09, 2021 at 11:11AM
No comments