Breaking News

వచ్చేవారం ప్రధాని అఖిలపక్ష సమావేశం.. జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా!


జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు బలం చేకూరేలా జమ్మూ కశ్మీర్‌పై అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్రహోదాతోపాటు కీలకమైన అంశాలను అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను 2019 ఆగస్టులో రద్దుచేయడంతో ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనపై తొలిసారిగా మోదీ సమావేశం నిర్వహిస్తున్నారు. ‘‘వచ్చేవారం జరిగే సమావేశం గురించి సమాచారం అందింది.. అధికారికంగా ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నాం’’ అని జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మరోవైపు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సహా భద్రత, నిఘా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సమావేశమయ్యారు. ఆర్టికల్ 370ను రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం.. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. ఈ నిర్ణయం ప్రకటించడానికి ముందు రోజే జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా సహా పలు రాజకీయ పార్టీలు నేతలను నిర్బంధంలోకి తీసుకుంది. వారిని కొన్ని నెలల తర్వాత విడుదల చేసింది. జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు కేంద్రం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబరులో స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్రం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో గుప్‌కార్ కూటమి (జమ్మూ కశ్మీర్‌లోని ఏడు రాజకీయ పార్టీలు) 100 స్థానాలు, బీజేపీ 74 స్థానాలను గెలుచుకున్నాయి. ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని కోరుతూ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ సహా ఏడు పార్టీలు గుప్‌కార్ కూటమిగా ఏర్పడ్డాయి. జమ్మూ కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక ప్రకటన చేశారు. సరైన సమయంలో జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2021పై చర్చ సందర్భంగా ప్రకటించారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియా యాప్‌‌‌‌ క్లబ్‌‌‌‌ హౌస్‌‌‌‌లో జరిగిన ఓ మీటింగ్‌‌‌‌లో మాట్లాడుతూ.. పునరుద్దరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌‌‌‌కు చెందిన జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘జమ్ము కశ్మీర్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర హోదా తొలగించడం, ఆర్టికల్ 370 రద్దు చేయడం చాలా బాధాకరం. మోడీ ప్రభుత్వం దిగిపోయి, మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ వాటిని అమలులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తాం’ అని దిగ్విజయ్ అన్నారు.


By June 19, 2021 at 08:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-to-hold-all-parties-meeting-for-jammu-and-kashmir-on-thursday/articleshow/83657636.cms

No comments