దేశ చట్టాలే అత్యున్నతం.. మీ విధానాలు కాదు: ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ షాక్
కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు అమలుకు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయి సంఘం పిలుపు మేరకు ఆ సంస్థ అధికారులు శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ చట్టాలే అత్యున్నతమైనవి తప్ప, సంస్థ విధివిధానాలు కాదని ట్విట్టర్‌కు పార్లమెంటు సభ్యులు స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సారథ్యంలోని ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ ప్యానెల్ ముందుకు ట్విటర్ ఇండియా పబ్లిక్ పాలసీ మేనేజర్ షగుఫ్తా కమ్రాన్, న్యాయవాది ఆయుషి కపూర్‌లు వచ్చారు. దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాల గురించి వీరు వివరించారు. తమ సంస్థ విధానాలకు కట్టుబడి ఉంటామని వారు చెప్పగా దీనికి స్థాయీ సంఘం అభ్యంతరం తెలిపింది. దేశ చట్టాలే సమున్నతమైనవని, వాటిని ఉల్లంఘిస్తున్నందున ఎందుకు జరిమానా విధించకూడదని సభ్యులు ప్రశ్నించారు. కఠినమైన ప్రశ్నలకు ట్విటర్ ప్రతినిధులు అస్పష్టంగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. తమ విధానాలు కూడా భారత చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయంటూ వారు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు నిషికాంత్ దుబే, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, తేజస్వీ సూర్య, సంజయ్ సేథ్, జాఫర్ ఇస్లాం, సుభాష్ చంద్ర, విపక్షాలకు చెందిన మహువా మొయిత్రా (టీఎంసీ), జయదేవ్ గల్లా (టీడీపీ) పాల్గొన్నారు. అధికార పక్షం సభ్యులు ప్రశ్నలు సంధించగా.. ట్విటర్ ప్రతినిధులు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని సభ్యులంతా అంగీకరించారు. నిబంధనల ప్రకారం సమస్యల పరిష్కారానికి శాశ్వతస్థాయి అధికారిని నియమించాల్సి ఉండగా, తాత్కాలికంగా నియమించడం పట్ల తప్పుపట్టారు. దుర్వినియోగం కాకుండా తీసుకుంటున్న చర్యలు, పౌరుల హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై ట్విట్టర్ ప్రతినిధులు వాంగ్మూలం ఇచ్చారు. ట్విటర్ అధికారులతో మరోసారి సమావేశం కావాలని ప్రతిపక్ష సభ్యులు సూచించారు. అయితే వివిధ ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చేలా ట్విటర్‌ను ఆదేశించాలని నిర్ణయించారు. ఇటీవల కాలంలో వివిధ అంశాలపై ట్విటర్, కేంద్ర ప్రభుత్వం మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ట్విటర్ అధికారులు హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకొంది.
By June 19, 2021 at 07:46AM
No comments