Breaking News

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ప్రక్రియకు మోదీ శ్రీకారం.. మోదీ నోటి వెంట గురజాడ మాట


కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం విర్చువల్‌గా ప్రారంభించారు. భారత్‌లో మొదలయ్యే వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రక్రియ ఇదే కావడం విశేషం. టీకా పంపిణీని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశీయ వ్యాక్సిన్ ద్వారా భారత్ సత్తాను ప్రపంచానికి చాటామని అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నియంత్రణే లక్ష్యంగా దేశవ్యాప్త టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. టీకా కోసం శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారు.. వారి కృషి ఫలితంగా రెండు దేశీయ వ్యాక్సి‌న్‌లు వచ్చాయన్నారు. మరికొన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తొలి హక్కుదారులని మోదీ అన్నారు. అతి తక్కువ సమయంలోనే టీకాను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాటంలో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. టీకా రెండు డోస్‌లను తప్పనసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ‘సొంత లాభం కొంతమానుకుని.. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్న ప్రముఖ కవి గురజాడ అప్పారావు మాటలను మోదీ గుర్తుచేశారు. తొలి విడతలో మూడు కోట్ల మందికి, రెండో దశలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్టు తెలియజేశారు. టీకా వచ్చిందని అలసత్వం పనికిరాదని కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అన్నారు. గతేడాది ఇదే రోజున కరోనా సర్వైలెన్స్ ప్రారంభించిన విషయాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు. భారత శాస్త్ర వైజ్ఞ‌ానిక సమర్ధతపై ప్రపంచానికి ఎంతో విశ్వాసం ఉందని మోదీ వ్యాఖ్యానించారు. టీకా కార్యక్రమం భారత సమర్ధతను సూచిస్తుందని అన్నారు. మనదేశంలో కరోనా వైరస్ ప్రవేశించే సమయానికి ఒక్క ల్యాబొరేటరీ పరీక్షించే అవకాశం ఉందని, ప్రస్తుతం 33 వేలకుపైగా ల్యాబ్‌లు ఉన్నాయని అన్నారు. దేశమంతా లాక్‌డౌన్ విధించి, ప్రజలను ఇళ్లకే పరిమితం చేశామని, ఇలా ఉండటం కష్టసాధ్యమైనా ఎంతో బాధ్యతగా వ్యవహరించి చాలా బాగా సహకరించారని పేర్కొన్నారు.


By January 16, 2021 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/prime-minister-narendra-modi-flags-off-vaccine-drive-in-india/articleshow/80297984.cms

No comments