Breaking News

క్వార్టర్స్‌ను ఖాళీచేయని మాజీ ఐఏఎస్.. 8 నెలలకు రూ.13 లక్షల కట్టాలని ప్రభుత్వం ఆదేశం!


పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వ నివాసాన్ని ఖాళీచేయకుండా అక్కడే తిష్టవేసిన ఓ మాజీ ఐఎస్ఎస్‌కు మహారాష్ట్ర సర్కారు భారీ ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వ భవనానికి అద్దె కింద రూ.13 లక్షలు చెల్లించాలని మహారాష్ట్ర ప్రజా పనుల విభాగం ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ఐఏఎస్ అధికారి కేపీ బక్షీ పదవీవిరమణ చేసిన తర్వాత కూడా దక్షిణ ముంబయి మంత్రాలయ సమీపంలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లోని యశోధా భవనాన్ని ఖాళీచేయలేదు. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన బక్షీ.. 2016 నవంబరు 30న హోం శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ హోదాలో పదవీవిరమణ చేశారు. తర్వాత ఆయనను జలవనరుల విభాగం ఛైర్మన్‌గా మూడేళ్ల కాలానికి ప్రభుత్వం నియమించింది. గతవారం మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ‘ఎవరైనా ఉద్యోగి పదవీవిరమణ చేసిన లేదా బదిలీ లేదా తొలిగించిన మూడు నెలల తర్వాత ప్రభుత్వ క్వార్టర్స్‌ను ఖాళీచేయకపోతే వారి నివాసాలకు విద్యుత్, తాగు నీరు, గ్యాస్ సరఫరా నిలిపివేస్తాం.. అలాగే చదరపు అడుగుకి రూ.150 చొప్పున జరిమానా విధిస్తాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలి మూడు నెలలు నెలకు రూ.2,395, తర్వాత ఐదు నెలలు నెలకు రూ.2.6 లక్షలు చెల్లించాలని రిటైర్డ్ అధికారి బక్షీకి బుధవారం ఇచ్చిన నోటీసులో స్పష్టం చేసింది. అయితే, తనకు పెనాల్టీ విధిస్తూ ఎటువంటి నోటీసు అందలేదని బక్షీ పేర్కొన్నారు. అంతేకాదు, జలవనరుల ఛైర్మన్‌గా తన పదవీకాలాన్ని పొడిగిస్తారని భావించానని అన్నారు. అంతేకాదు, మరికొద్ది కాలం క్వార్టర్స్‌లో ఉండటానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న నా బావమరదులు నాతోనే ఉన్నారని, ఈ సమస్యలన్నింటినీ నేను ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో వివరించానన్నారు. ఎటువంటి జరిమానా అద్దె విధించవద్దని అభ్యర్థించానని, ఎక్కువ కాలం ఇక్కడ ఉండాలనే ఉద్దేశం నాకు లేదని బక్షీ స్పష్టం చేశారు. కేవలం బక్షీ మాత్రమే కాదు, మరో ఆరుగురు రిటైర్డ్ ఐఏఎస్‌లు, బదిలీ అయిన అధికారులు కూడా ప్రభుత్వ నివాసాలను ఖాళీచేయకపోవడం గమనార్హం.


By January 16, 2021 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/retired-ias-officer-fined-rs-13-lakhs-for-overstaying-in-government-quarters/articleshow/80297107.cms

No comments