Breaking News

అయోధ్య: రామమందిర నిర్మాణానికి వజ్రాల వ్యాపారులు కళ్లుచెదిరే విరాళాలు


అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కాగా.. దాతల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌, విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) కలిసి శుక్రవారం నుంచి విరాళాల సేకరణ ప్రారంభించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలి విరాళం అందజేశారు. రూ.5 లక్షలు కోవింద్ విరాళం ఇవ్వగా.. పలువురు రాజకీయ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. ఉత్తర్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విరాళం కింద రూ.2లక్షల చెక్కును అందజేశారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, భారత్ వజ్రాల వ్యాపార కేంద్రం సూరత్‌లోని పలువురు వ్యాపారులు రామ మందిర నిర్మాణానికి కోట్లలో విరాళాలు అందజేయడం విశేషం. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్‌ భాయ్‌ దోలాకియా.రూ. 11 కోట్లు విరాళంగా ఇచ్చారు. స్థానిక విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయానికి శుక్రవారం వెళ్లిన ఆయన చెక్కును అందజేశారు. సూరత్‌కు చెందిన మరో వ్యాపారి మహేశ్‌ కబూతర్‌వాలా రూ. 5కోట్లు, లవ్‌జీ బాద్‌షా రూ. కోటి విరాళమిచ్చారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 15 నుంచి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామ జన్మభూమి ట్రస్ట్‌ కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌, వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ తదితరులు శుక్రవారం ఉదయం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా రూ. 5,00,100 చెక్కును రామ్‌నాథ్‌ కోవింద్‌ అందజేశారు. ఫిబ్రవరి 27 వరకు సాగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలు సేకరించనున్నట్లు ట్రస్ట్‌ తెలిపింది.


By January 16, 2021 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/gujarat-diamond-merchants-huge-donations-to-ayodhya-ram-mandir/articleshow/80296685.cms

No comments