Breaking News

అసాధ్యం అనుకున్నది సాధించిన ధారవీ.. తొలిసారి జీరో కేసులు


దేశంలో కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు 25వేలలోపు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా.. కరోనా కట్టడిలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో ప్రశంసలుందుకున్న ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబయి ధారవీలో గత 24 గంటల్లో ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాకపోవడం విశేషం. దేశంలో కరోనా వైరస్ మొదలైన తర్వాత ఈ ప్రాంతంలో కొత్త కేసులు నమోదు కాకపోవడం ఇదే తొలిసారి. ధారవిలో తొలి కరోనా వైరస్ కేసు ఏప్రిల్‌ 1న నమోదుకాగా.. అప్పటి నుంచి రోజూ వందలాది కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ధారవిలో 3,788 కరోనా కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 3,464 మంది కోలుకోగా.. 364 మంది చనిపోయారు. ప్రస్తుతం ధారవిలో 12 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉండగా.. వీరిలో ఎనిమిది మంది హోం ఐసోలేషన్‌లోనూ.. నలుగురు కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు వెల్లడించారు. జులై 26న ధారవిలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు కాగా... కొద్ది నెలల తర్వాత మళ్లీ పెరిగాయి. తాజాగా ఒక్క కేసూ నమోదు కాకపోవడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో ధారవి ఆదర్శంగా నిలిచింది. వైరస్ కట్టడి తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రశంసించింది. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌ పద్ధతిని అనుసరించి ప్రజల భాగస్వామ్యంతో కరోనాను కట్టడి చేయగలిగినట్టు బృహన్ ముంబయి అధికారులు తెలిపారు. కాగా, ముంబయిలో కొత్తగా 596 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మరో 11 మంది చనిపోయారు. దీంతో ముంబయిలో మొత్తం కేసుల సంఖ్య 2,89,800కి చేరుకోగా.. మరణాల సంఖ్య 11,056కి చేరింది. కరోనా నుంచి 2,69,672 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 8,218 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో బాధితుల కోసం మే నెలలో ఏర్పాటుచేసిన 200 పడకల ఆస్పత్రిని బీఎంసీ అధికారులు మూసేశారు. ధారవీలో కరోనా వైరస్ బారినపడ్డవారికి సాయి ఆస్పత్రి సహా రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మున్సిపల్ స్కూల్‌ను కోవిడ్ కేంద్రాలుగా మార్చింది. ఇక్కడ కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు చికిత్స అందజేశారు. కరోనా వైరస్ కట్టిడికి ధారవీలోని ప్రజలు కట్టుబడి ఉన్నారని, వారి సహకారంతోనే పాజిటివ్ కేసులు సున్నా మైలురాయిని చేరుకున్నామని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ దిఘ్వాకర్ అన్నారు. ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ విధానంతోనే ముందుకెళ్లామని, సకాలంలో గుర్తించడంతో పాజిటివ్ కేసులు తగ్గాయని అన్నారు.


By December 26, 2020 at 10:57AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/first-time-since-april-1-dharavi-reports-no-new-covid-case-on-yesterday/articleshow/79963398.cms

No comments