నూతన జాతీయ విద్యావిధానం.. విదేశీ భాషల జాబితా నుంచి చైనీస్ ఔట్!
రెండు రోజుల కిందట నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, సెకెండరీ స్థాయిలో విద్యార్థులు చైనా సహా విదేశీ భాషలను అభ్యసించాలని క్యాబినెట్ ఆమోదించిన తీర్మానంలో పేర్కొనలేదు. కానీ, 2019లో కేంద్రం విడుదల చేసిన ముసాయిదాలో మాత్రం (మాండరీన్)ను పొందుపరిచారు. త్రి-భాషా ఫార్ములా స్థానంలో కాకుండా ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, చైనీస్, జపాన్, జర్మన్‌లను విదేశీ భాషలుగా పేర్కొంది. ప్రస్తుతం ఆమోదించిన నూతన విద్యా విధానంలో చైనా భాషను వదిలిపెట్టింది. ‘ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి, విద్యార్థుల అభిరుచులు, ఆకాంక్షల ప్రకారం ప్రపంచ జ్ఞానం, చైతన్యాన్ని మెరుగుపరచడానికి కొరియన్, జపనీస్, థాయ్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ భాషలను చేర్చారు.. ఎన్ఈపీలో చేసిన ఈ మార్పు గురించి తనకు తెలియదని, కానీ కారణాలు స్పష్టంగా ఉన్నాయని ఈ ముసాయిదా రూపకల్పనలో పాల్గొన్న ఓ అధికారి అన్నారు. తూర్పు లడఖ్‌లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో 100 కి పైగా చైనా యాప్‌లను భారత్ నిషేధించింది. 2017 నుంచి బెంగళూరులో చైనీస్ ఒక భాషగా ప్రాచుర్యం పొందుతోందని, జపనీస్ సహా అనేక ఆసియా భాషలను అధిగమించడానికి సిద్ధంగా ఉందని విదేశీ భాషా ఉపాధ్యాయులు అంటున్నారు. అయితే, చైనా భాష కోసం మార్చి 2020 కార్యక్రమానికి ఎవరూ పేరు నమోదు చేయలేదని తెలిపారు. ఇక, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో త్రిభాషా సూత్రం అనుసరించే విద్యా బోధన జరుగుతుంది. ఈ విద్యావిధానం ద్వారా మాతృభాష, జాతీయ భాషతోపాటు ఏదో ఒక విదేశీ భాషను ఐచ్ఛికంగా తీసుకోవచ్చు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో త్రీ-భాషా సూత్రం రూపొందించారు. ఈ సూత్రాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తరువాత 1968 జాతీయ విధాన స్పష్టత ద్వారా అమలులోకి వచ్చింది. ఈ సూత్రం ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలూ మూడు భాషలను ఉపయోగించాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఆధునిక భారతీయ భాష (ప్రాధాన్యంగా దక్షిణ భారత భాష), హిందీయేతర రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఏదైనా ప్రాంతీయ భాష ఉండాలని నిర్ణయించారు.
By August 01, 2020 at 10:28AM
No comments