Breaking News

గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ.. ఆగస్టు, సెప్టెంబరులో సాధారణ వర్షపాతం


ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే దేశంలో ప్రవేశించినా.. తొలి రెండు నెలల్లో ఆశించిన వర్షపాతం కురువలేదు. జూన్ 1 నాటికి కేరళను తాకిన నైరుతి.. ఆ తర్వాత 18 రోజుల్లోనే దేశమంతటా విస్తరించడంతో రైతాంగంలో హర్షం వ్యక్తమయ్యింది. అయితే, జులైలో మాత్రం రుతుపవనాలు ముఖం చాటేశాయి. ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా సాధారణం కంటే జులైలో 10 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యింది. వాయువ్య, మధ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. నైరుతి రుతుపవనాలు నాలుగు నెలల్లో సగం రోజులు గడిచిపోవడంతో రాబోయే రెండు నెలలకు సంబంధించి వర్షపాతం అంచనాలను భారత వాతావరణ శాఖ శుక్రవారం వెలువరించింది. ఈ అంచనా ప్రకారం.. సెప్టెంబరులో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆగస్టు, సెప్టెంబరులో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈ పీరియడ్‌లో దాదాపు 104 శాతం మేర వర్షపాతం నమోదుకానుందని వివరించింది. ఆగస్టులో వర్షపాతం 97 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ‘పసిఫిక్ తీరంలో లా నినా పరిస్థితులు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నందున సెప్టెంబరులో భారీ వర్షపాతం నమోదవుతుందని, సాధారణంగా ఇలాంటి పరిస్థితులు వేసవిలో ఉంటాయి.. మొత్తంమీద ఈ నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం ఉంటుంది’ అని చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర అన్నారు. వందేళ్ల తర్వాత (1917) దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గతేడాది సెప్టెంబరులోనే అధిక వర్షపాతం కురిసింది. ప్రస్తుత రుతుపవనాల సీజన్ సగం కాలం ముగిసినా లోటు లేదా అదనపు వర్షపాతం నమోదుకాలేదు. జూన్‌లో దాదాపు 18% అదనపు వర్షపాతం నమోదుకాగా, జూలైలో సాధారణం కంటే 10% లోటుతో ముగిసింది. ఐఎండీ తాజా అంచనా ప్రకారం.. ద్వితీయార్ధంలో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం కురవదు. రెండో దశలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణంగా ఉంటుందని అంచనా (ఎల్పీఏలో 94-106%). ఏదేమైనా, ఇది సాధారణ వర్షపాతం (106% ఎల్పీఏ) కంటే ఎక్కువగా ఉంటుంది. జూలైలో సాధారణ వర్షపాతం ఎల్‌పిఎలో 103% ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడకపోవడం వర్షాకాలం నిరుత్సాహపరిచింది. జులై నెలలో ఒక్క అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడలేదు. సాధారణంగా, జూలైలో మూడు నుంచి నాలుగు వరకు ఏటా ఏర్పడి తరువాత తూర్పు తీరం మీదుగా లోతట్టు ప్రాంతాలవైపు కదులుతాయి. దీని ప్రభావంతో మధ్య, ఉత్తర భారతంలో వర్షం కురుస్తుంది. అలాగే, హిమాలయ పర్వత ప్రాంతాల వద్ద రుతుపవనాలు చాలా కాలం పాటు ఉండిపోవడం వర్షపాతానికి అనుకూలంగా లేదు’ అని ఐఎండీ వర్షపాత అంచనాల డైరెక్టర్ శివానంద అన్నారు.


By August 01, 2020 at 09:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/monsoon-10-deficient-in-july-driest-in-5years-possibility-of-heavy-rains-in-september-says-imd/articleshow/77296619.cms

No comments