Power Star Trailer రివ్యూ.. మరీ ఇంత దారుణమా? పవన్ వ్యక్తిగత జీవితాన్ని సైతం వదలని వర్మ
ఏంటయ్యా.. వర్మా!! మా కర్మ కాకపోతే ట్రైలర్ చూడ్డానికి కూడా డబ్బులు పెట్టావ్ అని ‘పవర్ స్టార్’ సినిమా ట్రైలర్ విషయంలో చాలా తిట్లు తిన్నాడు వర్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘పవర్ స్టార్’ ట్రైలర్ ()ను నేడు (జూలై 22) ఉదయం 11 గంటలకు rgv world theatre comలో విడుదల చేస్తానని ముందే ప్రకటించారు వర్మ. ఇందుకోసం రూ.25 చెల్లించాల్సి ఉంటుందని అడ్వాన్స్ బుకింగ్స్ షురూ చేసిన వర్మకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. నాలుగు నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ముందుగానే యూట్యూబ్‌లో రిలీజైంది. ఇది కూడా వర్మ స్ట్రాటజీగానే భావిస్తున్నారు.. డబ్బులు పెడితేనే ట్రైలర్ అంటే యూట్యూబ్ ద్వారా వచ్చే వ్యూస్ కూడా తగ్గుతాయని వర్మే తన టీం ద్వారా ‘పవర్ స్టార్’ (Power Star Trailer) ట్రైలర్‌ను లీక్ చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే.. తన ట్రైలర్‌ను లీక్ చేశారంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ‘పవర్ స్టార్’ ట్రైలర్ ఎలా ఉందన్న విషయానికి వస్తే.. ‘లార్డ్ బాలాజీ మీద ఒట్టేసి చెబుతున్నా.. ఈ మూవీలో ఎవరినీ తక్కువ చేసి చూపించను’ అని చెప్పిన వర్మ తన ఒట్టుతీసి గట్టుపై పెట్టాడు. తక్కువ చేసి చూపించను అని అన్నారే కాని.. పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన దాన్ని చాలా ఎక్కువ చేసి చూపించారు. పవర్ స్టార్ ట్రైలర్ (Power Star Trailer) లో పవన్ కళ్యాణ్‌ను ప్రవన్ కళ్యాణ్‌గా పేరు మార్చారు వర్మ. ఆయన ఫామ్ హౌస్‌లో ఏం చేస్తుంటారనే విషయంతో ట్రైలర్ ప్రారంభించిన వర్మ.. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అంటూ రచ్చ మొదలుపెట్టారు. ప్రవన్ కళ్యాణ్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.. భీమవరంలో ప్రవన్ కళ్యాణ్ ఓడిపోయారు.. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంటూ టీవీ న్యూస్‌ని చీకటి గదిలో ఒక్కడే కూర్చుని ప్రవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా చూపించారు. ‘ఒక్క సీటు.. ఒక్క సీటు సీటు కూడా రాలేదా?? అంటూ పవర్ స్టార్ ఏడుస్తూ డైలాగ్ చెప్పగా.. ఒక్కటి వచ్చింది సార్.. కాని మీకు ఒక్కటి కూడా రాలేదు’ అంటూ పంచ్ పేల్చారు. అనంతరం టీవీలు పగలగొట్టిన పవర్ స్టార్.. దర్శకుడు త్రివిక్రమ్‌ని పోలిన వ్యక్తి చెంప పగలగొట్టేశాడు. ఒక్క స్పీచ్ కూడా వర్కౌట్ కాలేదు.. అయినా ఒక్క సీటు ఏంట్రా ఛా!! అంటూ టీఎస్ కాలర్ పట్టుకున్నారు పవర్ స్టార్. ఒక్కసారి నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పరా.. నువ్ పవర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా?? లేక నా తమ్ముడు గానా? అంటూ చిరంజీవి డూప్‌తో డైలాగ్ చెప్పించారు వర్మ. ఇక చంద్రబాబుని వదల్లేదు వర్మ.. ‘సత్యప్రమాణకంగా చెప్తున్నాను బ్రదర్.. మీరు ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నాను’ అంటూ పవర్ స్టార్‌తో బాబు చెప్పే డైలాగ్‌తో మంట పెట్టాడు వర్మ. ఇక ‘మిమ్మల్ని నమ్మొద్దు... నమ్మొద్దు అని చాలా మంది చెప్పారు.. మీకో దండం సామీ.. వెళ్లండి అంటూ బయటకు పొమ్మనే సీన్’.. రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఆయనతోనే తిట్టించారు వర్మ.. ఆ మీటింగ్‌లకు లక్షల్లో జనాలు ఏంటి?? ఏం మాట్లాడనీయకుండా సీఎం సీఎం అంటూ కేకలు ఏంటి?? మాట్లాడితే చప్పట్లు.. జుట్టు ఎగరేస్తే ఈలలు.. మీసం తిప్పితే గోలలు.. అబ్బబ్బబ్బా.. ఇదంతా చూసి అది అయిపోతాం.. ఇది అయిపోతాం అని చివరికి ఏదీ కాకుండా ఇలా మిగిలిపోవడం ఏంటి?? అంటూ పవర్ స్టార్ చెప్పే డైలాగ్ ఆయన ఫ్యాన్స్‌తో కిరికిరి పెట్టేలా ఉంది. ఇక పవన్ కళ్యాణ్‌ని ద్వేషించే కత్తి మహేష్‌ని సైతం తెరపైకి తీసుకు వచ్చాడు వర్మ.. ‘గగన్ సీఎం కాడు అని బాహుబలి రేంజ్‌లో రంకెలు వేశారు.. ఇప్పుడు ఆయనే సీఎం.. ఇప్పుడు ఏమంటారు’ అంటూ పవర్ స్టార్‌ని ప్రశ్నించే జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు కత్తి మహేష్. ఇక నాగబాబుని వదల్లేదు వర్మ. నిన్ను అన్నయ్యను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు.. నువ్ అసమర్థుడివి అని.. ప్యాకేజ్ స్టార్‌వి అని.. గుండు సున్నావి అని.. అందరూ నోటికొచ్చినట్టు వాగుతుంటే.. నాకు పిచ్చి కోపం వస్తుంది తమ్ముడూ అంటూ నాగబాబుతో పవర్ స్టార్ ఫోన్‌లో సంభాషిస్తున్న సీన్ పెట్టారు. వాళ్లు అనిందేమో కాని.. నువ్ ఫోన్ చేసి ఆ తిట్లు గుర్తు చేయడం అవసరమా? అంటూ చివర్లో పవర్ స్టార్ ఇచ్చే పంచ్ ఫన్నీగా ఉంది. పవన్ భక్తుడు బండ్ల గణేష్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు వర్మ.. ఆయన డూప్‌తో ‘మీరు ఎన్నికల్లో ఓడిపోతే వంద కొబ్బరి కాయలు కొట్టి గుడిలో అర్చన చేయిస్తా అని మొక్కుకున్నా’ అంటూ పవర్ స్టార్ కాళ్లపై పడే సీన్ మరీ దారుణంగా ఉంది. బాబూ.. బాబూ.. మీరు సీఎం అయితే సినిమాలు చేయరు బాబు.. అప్పుడు నాతో సినిమా చేసే హీరో ఉండడు. అప్పుడు నా బతుకు బస్టాండ్ అవుతుంది బాబూ.. అంటూ బండ్ల గణేష్ పాత్రధారి చెప్పే డైలాగ్ ఆయన్ని కించపరిచే విధంగా ఉంది. ఇక రష్యన్ మహిళతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా.. సార్ పూణె నుంచి ఫోన్ అని తన అసిస్టెంట్ ఫోన్ ఇవ్వడం.. దానికి రష్యన్ మహిళ నిలదీయడం.. నేను కాదు కదా ఫోన్ చేసిందని పవర్ స్టార్ చిరాకు పడటం ద్వారా ఆయన వ్యక్తిగత జీవితాన్ని సైతం ఈ వివాదాల ‘పవర్ స్టార్’లోకి లాగాడు వర్మ. మొత్తంగా నాలుగు నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌లో వర్మ.. పూర్తిగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు.. చిరంజీవి, నాగబాబు, బండ్ల గణేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కించపరుస్తూ.. సీన్లు పెట్టాడు వర్మ. పవర్ స్టార్ పూర్తి సినిమాను జూలై 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నాడు వర్మ. అన్నట్టు ఈ ట్రైలర్ చివర్లో వర్మ ఎంట్రీ ఓ రేంజ్‌లో ఉంది. వోడ్కా బాటిల్ పట్టుకుని హడలెత్తించాడు వర్మ.
By July 22, 2020 at 10:15AM
No comments