చైనాపై ముప్పేట దాడి.. కోవిడ్‌పై సెనేట్‌లో అమెరికా సంచలన బిల్లు!
మహమ్మారి వ్యాప్తికి చైనాయే కారణమని విమర్శలు గుప్పిస్తోన్న అమెరికా.. తాజాగా, కీలక నిర్ణయం తీసుంది. కరోనా వైరస్ విషయంలో ఫెడరల్ కోర్టులో చైనాపై అమెరికన్లు కేసులు పెట్టడానికి అనుమతించే బిల్లును సెనేట్‌లో సోమవారం ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు సెనేట్‌లో దీనిని ప్రతిపాదించారు. ఈ బిల్లు చట్టంగా మారితే ఫెడరల్ కోర్టులకు మహమ్మారికి చైనా కారణమైందని లేదా గణనీయంగా దోహదపడిందనే వాదనలను వినడానికి అధికారాన్ని ఇస్తుంది. రిపబ్లికన్ సెనేటర్లు మర్తా మెక్‌సెల్లీ, మార్ష్ బ్లాక్‌బర్న్, టామ్ కాటన్, జోష్ హవ్లే, మైక్ రౌండ్స్, థామ్ టిల్లిస్ ఈ బిల్లను ప్రవేశపెట్టారు. చైనా నిర్లక్ష్యం వల్లే ప్రపంచం మొత్తం వ్యాపించిందని, దానిపై చర్యలు తీసుకోడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, అమెరికాలోని చైనా ఆస్తులను స్తంభింపచేయడానికి ఫెడరల్ కోర్టులకు అధికారం దఖలుపడుతుందని వివరించారు. ఉగ్రవాద బాధితులకు, ముఖ్యంగా 9/11 బాధితులకు మరింత చట్టపరమైన ఉపశమనం కలిగించిన 2016 జస్టిస్ ఎగైనెస్ట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ (జాస్టా) తరువాత ఆ తరహా చట్టం ఇదే కావడం విశేషం. ‘చైనా కమ్యూనిస్ట్ పార్టీ అబద్ధాలు, మోసాలకు గురైన అమెరికన్లు.. తమ ప్రియమైన వారిని కోల్పోయినా, వ్యాపార నష్టాలను చవిచూసినా లేదా కోవిడ్-19 కారణంగా వ్యక్తిగతంగా నష్టపోయినా చైనాను బాధ్యలుగా చేసి, పరిహారం కోరే అవకాశం ఉంది’ మెక్‌సెల్లీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో తమవారిని పొగొట్టుకోవడం, ఆర్ధికంగా నష్టపోయిన అమెరికన్లకు చైనా నుంచి ముక్కుపిండి వసూలు చేయడానికి ఇది సహకరిస్తుందన్నారు. కోవిడ్-19 విషయంలో వాస్తవాలు దాచిపెట్టి, లబ్దిపొందడానికి ప్రయత్నించిన చైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని బ్లాక్‌బర్న్ అన్నారు. ‘ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం, లక్షలాది మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు.. ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వ్యాపారాలు నిలిచిపోయాయి.. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు న్యాయం పొందడానికి అర్హులు’అని ఆయన అన్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించిన వైద్యులు, జర్నలిస్ట్‌ల నోళ్లను చైనా కమ్యూనిస్ట్ పార్టీ బలవంతంగా నొక్కేసిందని, దీని వల్ల లక్షలాది మంది చనిపోవడమే కాదు, ఆర్ధికంగా అపార నష్టం కలిగిందన్నారు.
By July 22, 2020 at 09:46AM
No comments