Breaking News

చైనా, పాక్‌ నుంచి విద్యుత్ ఉపకరణాల దిగుమతిపై నిషేధం.. కారణం ఇదే: కేంద్రం


సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకున్న వేళ.. చైనాకు చెందిన విద్యుత్ ఉపకరణాల దిగుమతిపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై మంత్రి మరోసారి స్పందించారు. విద్యుత్ చట్ట సవరణ ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకోవడానికి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలువురు సీఎంలు, విద్యుత్ శాఖ మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు రంగానికి సైబర్‌ దాడుల ముప్పు పొంచి ఉందని, అందుకే చైనా, పాకిస్థాన్‌ పరికరాలను దిగుమతి చేసుకోబోమని స్పష్టం చేశారు. ఈ ఉపకరణాల్లో ప్రవేశపెట్టిన మాల్‌వేర్‌ ద్వారా దేశంలోని పవర్‌గ్రిడ్‌ను షట్‌డౌన్ చేసే అవకాశం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాల డిస్కంలు కూడా చైనా సంస్థలకు ఆర్డర్లు ఇవ్వొద్దని కోరినట్టు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. కేంద్రం అనుమతి లేకుండా దిగుమతి చేసుకోవద్దని సూచించారు. విద్యుత్ పరికరాలను చైనా లేదా ఇతర దేశం నుంచి భారతీయ సంస్థలు దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనసరని స్పష్టం చేశారు. ఆ పరికరాల్లో మాల్‌వేర్ ఉందా? లేదా?, భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? అనే అంశాలను పరిశీలిస్తామని తెలిపారు. వీటిని కేంద్ర విద్యుత్ శాఖ అమోదం పొందిన ల్యాబొరేటరీల్లో పరీక్షిస్తామని అన్నారు. ‘ఇక, 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.71,000 కోట్ల విలువైన విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంటే.. వీటిలో రూ.21వేల కోట్లు చైనా నుంచే వచ్చాయి.. దీన్ని మనం సహించలేం. మన భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే దేశం, మన సైనికులను చంపుతుంది.. మనం ఆ దేశంలో ఉద్యోగాలు సృష్టిస్తాం’కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ‘భారత్‌ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ నుంచి దిగుమతులను అనుమతించబోమని మేము నిర్ణయించుకున్నాం.. వాటిలో (చైనా నుంచి దిగుమతులతో సహా) మాల్వేర్ లేదా ట్రోజన్ హార్స్ ఉండవచ్చు.. అవి మన విద్యుత్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి రిమోట్‌గా పనిచేయగలవు.. చైనా, పాక్ నుంచి ఏదైనా దిగుమతి చేసుకోవడానికి అనుమతించం’ అని మంత్రి ఉద్ఘాటించారు.


By July 04, 2020 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-wont-import-power-equipments-from-china-and-pakistan-says-union-minister-r-k-singh/articleshow/76780007.cms

No comments