Breaking News

కొనసాగుతోన్న కోవిడ్ ఉద్ధృతి.. నిన్న ఒక్కరోజే 38వేలకుపైగా పాజిటివ్ కేసులు


దేశవ్యాప్తంగా కరోనా రక్కసి మరింత విజృంభిస్తోంది. కేవలం మూడు రోజుల్లో లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. శనివారం రికార్డుస్థాయిలో ఏకంగా 38వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో 545 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 27వేలకు చేరువయ్యింది. రోజువారీ కేసుల్లో మంగళవారం తొలిసారిగా 30వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు.. శనివారం నాటికి 38,141కి చేరాయి. వారం రోజుల్లోనే 4,127 మంది చనిపోయారు. దేశంలో వైరస్ మొదలైన తర్వాత ఒక్క వారంలోనే ఇంత పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. కేసులు 10 లక్షలు దాటిన రెండు రోజుల్లోనే ఈ సంఖ్య 10.76 లక్షలు దాటడం గమనార్హం. ఇప్పటి వరకూ కోవిడ్ నుంచి 6.75 లక్షల మంది బాధితులు కోలుకోగా.. మరో 3.74 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63 శాతానికి చేరింది. గడచిన వారం రోజుల్లోనే మరణాల 15 శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, నాలుగు రోజుల తర్వాత తొలిసారి శనివారం కరోనా మరణాలు 600లోపు నమోదయ్యాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య 26,787కి చేరింది. శుక్రవారంతో పోల్చితే మహరాష్ట్ర (144), కర్ణాటక (93)లో మృతుల సంఖ్య శనివారం తక్కువగా నమోదుకాగా.. తమిళనాడు (88), ఆంధ్రప్రదేశ్‌ (52)లో మాత్రం పెరిగాయి. లాక్‌డౌన్ మొదలై దాదాపు నాలుగు నెలలు పూర్తికావస్తుండగా.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు శనివారం నాటికి 3 లక్షలకు చేరాయి. శనివారం ఏకంగా 8,348 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రతో పాటు, తమిళనాడు (4,807), కర్ణాటక (4,537), ఆంధ్రప్రదేశ్ (3,963), బెంగాల్ (2,198), అసోం (1,218), గుజరాత్ (960) శనివారం రికార్డు స్థాయిలో కేసులు నిర్ధారణ అయ్యాయి.


By July 19, 2020 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/fresh-cases-cross-new-high-of-38000-on-saturday-4127-deaths-in-last-7-days-in-india/articleshow/77045953.cms

No comments