దారుణం: మొన్న ఏనుగు.. నేడు ఆవు.. గోధుమ పిండిలో టపాసులు పెట్టి తినిపించారు
పేలుడు పదార్థాలు కలిగిన పండును తిని గర్భంతో ఉన్న ఏనుగు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే హిమాచల్‌ప్రదేశ్‌లో అలాంటి హేయమైన ఘటనే చోటుచేసుకుంది. ఈసారి గోమాతకు ఆ దుస్థితి ఎదురయ్యింది. బిలాస్‌పూర్‌లోని జన్‌దుత ప్రాంతంలో గర్భంతో ఉన్న ఓ ఆవు దవడ పగిలి రక్తమోడుతూ వీధుల్లో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగుడు కావాలనే గోధుమ పిండిలో పేలుడు పదార్థాలను పెట్టి ఆవుతో తినిపించినట్టు తెలుస్తోంది. మే 26 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదుచేసిన ఆవు యజమాని, ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఇంటి పక్కన ఉండే నందలాల్ కావాలనే ఇలా చేశాడని ఆయన ఆరోపించాడు. దుశ్చర్యకు పాల్పడిన నిందితుడు నందలాల్ ఇది జరిగిన వెంటనే ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆవు యజమాని గురుదయాళ్ ఫిర్యాదు మేరకు జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, ఇలాంటి దురాగతానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై బిలాస్‌పూర్ ఎస్పీ దేవకర్ శర్మ మాట్లాడుతూ.. అత్యంత శక్తివంతమైన టపాసులు ‘ఆలు బాంబు’ను గోధుమ పిండి ముద్దగా చేసి దాని లోపల ఉంచి, ఆవుకు తినిపించారని, దానిని నమిలినప్పుడు పేలిపోవడంతో ఆమె నోటికి గాయమైందని తెలిపారు. దీనికి పాల్పడిన నిందితుడిపై జంతు సంరక్షణ చట్టం 286 కింద కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు. నిందితుడితోపాటు మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు చేపట్టామని వివరించారు. తమ పొలాల్లోని పంటలపై జంతువులు దాడిచేసి ధ్వంసం చేయకుండా ఉండేందుకు టపాసులను గోధుమ పిండి బాల్స్‌లో పెట్టి ఉంచుతారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అడవి పందులను చంపడానికి వేటగాళ్లు కూడా ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తారని, అయితే కొన్నిసార్లు పెంపుడు జంతువులు ఇటువంటి వ్యూహాలకు బలైపోతాయని ఓ అటవీ అధికారి వెల్లడించారు.
By June 07, 2020 at 07:52AM
No comments