మహిళల వివాహ వయసు పెంపుపై కేంద్రం కీలక ముందడుగు!
మహిళల కనీస వివాహ వయస్సు పెంపుపై కేంద్రం దృష్టి సారించింది. మహిళలు ఏ వయసులో తల్లి అయితే ఆరోగ్యకరమో అన్న అంశాన్ని అధ్యయనం చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల వివాహ వయస్సు ప్రస్తుతం 18 ఏళ్లు కాగా, దీన్ని ఎంతకు పెంచాలనేదానిపై ఈ టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేయనుంది. జయా జైట్లీ అధ్యక్షతన ఏర్పడిన ఈ టాస్క్‌ఫోర్స్‌లో 10 మందిని సభ్యులుగా నియమించింది. ఢిల్లీకి చెందిన నజ్మా అఖ్తర్, మహారాష్ట్రకు చెందిన వసుధా కామత్, గుజరాత్‌కు చెందిన దీప్తి షా తదితరులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్‌తోపాటు, కేంద్ర వైద్య-ఆరోగ్యం, మహిళాశిశు సంక్షేమం, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, న్యాయశాఖల కార్యదర్శులు కూడా ఇందులో సభ్యులుగా కొనసాగుతారు. ఈ టాస్క్‌ఫోర్స్ జులై 31 నాటికి తన నివేదికను అందజేయనుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనకు అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేశారు. ‘‘శారదా చట్టం-1929లోని నిబంధనలను సవరించి 1978లో మహిళల వివాహ వయస్సును 15 నుంచి 18 ఏళ్లకు పెంచారు. ప్రస్తుతం భారత్ ఎంతో పురోగమించింది. మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతస్థానానికి ఎదగడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. మాతృ మరణాలను తగ్గించడంతోపాటు పోషకాహార స్థాయిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. మహిళ ఏ వయస్సులో మాతృత్వంలోకి అడుగుపెట్టాలన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం అంశాలను పరిశీలించాల్సి ఉంది. అందుకోసం ఆరునెలల్లో సిఫార్సులు చేసేలా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో మాతృ మరణాల రేటు గణనీయంగా తగ్గింది. 1990 నుంచి 2016 మధ్య ఇది 77 శాతం మేర తగ్గడం శుభపరిణామం. 90వ దశకంలో 556గా ఉన్న ఈ మరణాలు.. 2016 నాటికి 130కి చేరాయి. 2019కి ఏకంగా 122 దిగువకు పడిపోయాయి. దేశంలో వైద్య ఆరోగ్య సదుపాయాలు మెరుగుపడటం, హాస్పిటల్స్‌లో కాన్పులు, పౌష్ఠికాహారం స్థాయి పెరగడం లాంటి కారణాలు దీనికి దోహదం చేశాయి. జనని సురక్ష లాంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి మాతృ మరణాలను తగ్గించగలిగారు. ఈ మరణాలను తగ్గించడంతో రాజస్థాన్ పురోగతి సాధించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ప్రసవ సమయం లేదా తరువాత మహిళలు చనిపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయి. మహిళల సాధారణ ఆరోగ్యం, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ వంటివి చాలా ముఖ్యమైనవి. ప్రీక్లాంప్సియా, రక్తస్రావం, ఇన్ఫెక్షన్, అసురక్షిత గర్భస్రావం వంటి సమస్యలతో మహిళలు మరణిస్తారు. తాజాగా ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ శిశు మరణాల రేటు, బాలల లింగ నిష్పత్తి, సంతానోత్పత్తి రేటు, జననాల నిష్పత్తిని కూడా పరిశీలిస్తుంది. ఇవన్నీ తల్లి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలే కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది.
By June 07, 2020 at 07:29AM
No comments