Breaking News

కాలాపానీ వివాదంపై చర్చలకు నేపాల్ పట్టు.. ధీటుగా బదులిచ్చిన భారత్


కాలాపానీ సరిహద్దు వివాదంపై విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలకు పట్టుబడుతున్న నేపాల్.. ఇదే సమయంలో తన కొత్త మ్యాప్‌ను ధ్రువీకరించడానికి రాజ్యాంగ సవరణ ద్వారా ముందుకు వచ్చింది. అయితే, చర్చల విషయంలో నమ్మకం, విశ్వాసం వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం భారత్ స్పష్టం చేసింది. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ ఎక్కువ సమయం కోరడం, ప్రతిపాదిత సవరణ సమస్యలను కూడా పరిష్కరించాలని మాధెసిస్ కోరిన తరువాత కేపీ ఓలీ ప్రభుత్వం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేకపోయింది. ఈ అంశంపై నేపాల్‌లో పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు గుర్తించిందని, దాని తీవ్రతను పరిగణనలోకి తీసుకుందని భారత్ తెలిపింది. ‘విశ్వసనీయత, విశ్వాసం, పరస్పర సున్నితత్వం, పరస్పర గౌరవం ఆధారంగా తన పొరుగువారితో వివాదాలను చర్చించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇది నిరంతర ప్రక్రియ.. నిర్మాణాత్మక, సానుకూల ప్రయత్నాలు అవసరం’ విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. చర్చల కోసం నేపాల్ విజ్ఞప్తిపై మీడియా అడిగిన ప్రశ్నకు ాయన సమాధానమిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరు దేశాల మధ్య వివాదం ఉండదని భారత్ అభిప్రాయపడింది. ఇప్పటికే నేపాల్ రాయబారి నీలాంబర్ ఆచార్యతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లా సమావేశమయ్యారు.. ఈ వివాదం బాధ్యతలను విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి పియూష్ శ్రీవాస్తవ‌కు కేంద్రం అప్పగించిందని, ఇప్పటికే ఆయన పలుసార్లు నేపాల్ రాయబారితో సమావేశమై, తరుచూ చర్చిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, భారత ఉన్నతాధికారులను తమ రాయబారి కలవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటూ నేపాల్ మీడియా ఇటీవల పేర్కొంది. కాలాపానీ అంశంపై చర్చించాలని గతేడాది నవంబరు నుంచి నేపాల్ డిమాండ్ చేస్తుండగా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ కొత్త మ్యాప్‌ను డిసెంబరులో విడుదల చేసింది. అప్పటి నుంచి సరిహద్దు వివాదాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఇరు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు ప్రారంభించాలని నేపాల్ డిమాండ్ చేస్తోంది. నేపాల్ కాంగ్రెస్ కేంద్ర కార్యవర్గ కమిటీ శనివారం సమావేశమై జాతీయ చిహ్నం, మ్యాప్‌ను సవరించే ప్రతిపాదనపై చర్చించనున్నట్లు నేపాల్ మీడియా నివేదికలు తెలిపాయి. కొత్త మ్యాప్ కోసం తీసుకున్న నిర్ణయానికి ఆ పార్టీ మద్దతు ఇచ్చింది. నేపాల్‌తో లోతైన చారిత్రక, సాంస్కృతిక, స్నేహపూర్వక సంబంధాలకు భారత్ చాలా ప్రాముఖ్యతనిచ్చిందని విదేశాంగ శాఖ తెలిపింది. ‘కోవిడ్ -19 మహమ్మారిపై పోరుకు వైద్య సామాగ్రి, ఇతర సదుపాయాల విషయంలో సహాయాన్ని అందించడంతో పాటు, నేపాల్‌కు ఔషధాలు సహా అవసరమైన వాణిజ్యం, నిత్యావసరాల సరఫరాను భారత్ కొనసాగిస్తుంది’ అని శ్రీవాస్తవ తెలిపారు. భారత్‌ అధీనంలో ఉన్న లిపులేఖ్‌, , లింపియాధురాలు ప్రాంతాలను తమ దేశ అంతర్గత భూభాగాలుగా పేర్కొంటూ రూపొందించిన మ్యాప్‌‌ను నేపాల్‌ క్యాబినెట్ ఆమోదించింది. అనంతరం ఓలీ పార్లమెంటులో మాట్లాడుతూ.. ఈ మూడు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యానించారు.


By May 29, 2020 at 09:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nepal-pushes-talks-for-kalapani-border-issue-india-says-need-to-create-trust-first/articleshow/76083341.cms

No comments