కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: తెలంగాణలో పెరిగిన కంటెయిన్‌మెంట్ జోన్‌లు

⍟ అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. రోజుకు వందలాది మంది దీనికి బలవుతున్నారు. గత పదిహేను రోజుల నుంచి ఉద్ధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి విజృంభణను దేశవ్యాప్త విపత్తుగా ప్రకటించారు. దేశంలోని 50 రాష్ట్రాల్లో మహా విపత్తు పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో ఇలా చేయడం ఇదే మొదటిసారి. తొలి కేసు నమోదైనప్పటి నుంచి తీవ్రతను బట్టి ఒక్కో రాష్ట్రంలో విపత్తును ప్రకటిస్తూ వచ్చిన శ్వేతసౌధం చిట్టచివరిగా శనివారం వ్యోమింగ్‌కూ దాన్ని వర్తింపజేసింది. దీంతో అన్ని రాష్ట్రాలు మహా విపత్తును ఎదుర్కొంటున్నట్లుగా గుర్తించినట్టయ్యింది. ⍟ తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శనివారం మరో 16 కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 503కి చేరింది. ఇప్పటి వరకూ 133గా ఉన్న కంటైన్‌మెంట్ జోన్‌లు ప్రస్తుతం 200కు చేరాయి. హైదరాబాద్‌లో 13 ఉన్నవాటిని 44గా చేర్చారు. ఒక్క కేసు వచ్చినా ఆ ప్రాంతంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు భావించాలని సీఎం సూచించారు. ⍟ కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి ధాటికి అగ్రరాజ్యాలు విలవిల్లాడుతున్నాయి. కంటికి కనిపించని శత్రువుపై చేస్తున్న పోరాటంలో రోజూ వేలాది మంది బలవుతున్నారు. మహమ్మారిని కట్టడికి చేయడానికి కఠినమైన ఆంక్షలు విధించినా మరణాల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతోంది. అమెరికాలో 24 గంటల వ్యవధిలోనే 2,108 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, కరోనా మరణాల్లో ఇటలీని అగ్రరాజ్యం అధిగమించింది. ⍟ దేశంలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా.. దీనిని మరో రెండు వారాలు పొడిగించాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ముఖ్యమంత్రులతో ప్రధాని శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక, పలు రాష్ట్రాలు కేంద్రం కంటే ముందు లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నాయి. తొలుత ఒడిశా, తర్వాత పంజాబ్, కర్ణాటక, తాజాగా తెలంగాణ కూడా తమ రాష్ట్రాల్లో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి. ⍟ లాక్‌డౌన్ చేపట్టడం, సోష్ల్ డిస్టెన్సింగ్ పాటించడం వల్ల కరోనా వ్యాప్తి వేగాన్ని అరికట్టగలిగామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. లేదంటే భారీ సంఖ్యలో జనం కరోనా బారిన పడే వాళ్లని ఆరోగ్య శాఖ తెలిపింది. లాక్‌డౌన్ లేకపోతే ఏప్రిల్ 15 నాటికే దేశంలో 8.2 లక్షల కరోనా కేసులు నమోదయ్యేవని కేంద్రం తెలిపింది. ⍟ కరోనా వైరస్ మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోంది. శనివారం ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు 1069కి చేరాయి. శనివారం ఒక్కరోజే 166 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర తర్వాత పాజిటివ్ కేసులు వెయ్యి మార్కును దాటిన రాష్ట్రంగా నిలిచింది . ⍟ దేశంలో లాక్‌డౌన్ పొడిగింపుతో వలస కార్మికులు జీవితాలు దయనీయంగా మారాయి. ఉన్న చోట ఉపాధి లేదు, ప్రభుత్వం అందించే సాయం చాలడం లేదు. ఖర్చులేమో పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సొంతూళ్లకు పయనం అవుతున్నారు. కొందరు నిత్యావసరాలను చేరవేసే వాహనాల్లో రహస్యంగా ప్రయాణం సాగిస్తే.. మరికొందరు కాలినడక వందల కి.మీ. నడుస్తూ సొంతూళ్లకు వెళ్తున్నారు. ⍟ మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ అని తేలడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అకోలా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం అసోం నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. . ⍟ ప్రమాదకర కరోనా వైరస్‌కు చెక్ చెప్పేందుకు లాక్‌డౌన్‌ను చాలా దేశాలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లోనూ గతనెల నుంచి ఈనెల 14 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునేందుకు తాజాగా ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించారు. ⍟ మహారాష్ట్ర సరిహద్దులను మూసివేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. పొరుగు రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్న సీఎం.. ఒక్క రోజే 11 మంది చనిపోయారన్నారు. తెలంగాణతో ఆ రాష్ట్రానికి సుదీర్ఘ సరిహద్దు ఉండటంతోపాటు చాలా సంబంధాలు ఉన్నాయన్నారు. ⍟ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పరిస్థితుల విషయమై మంత్రివర్గంతో చర్చ జరిపిన అనంతరం సీఎం కేసీఆర్ శనివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే లాక్‌డౌన్ పొడిగించాలని కేసీఆర్ ప్రధాని మోదీని కోరిన సంగతి తెలిసిందే. ⍟ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 24 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 17 కరోనా కేసులు నమోదు కాగా.. కర్నూలు జిల్లాలో ఐదు.. ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.
By April 12, 2020 at 08:57AM
No comments