చత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం.. దంతేవాడ ఎస్పీ సహా ఐదుగురు మృతి?

చత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్పీ దుర్మరణం చెందారు. ఎస్పీ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దంతేవాడ సహా ఐదుగురు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇది సాధారణంగా జరిగిన ప్రమాదమేనా? దీని వెనుక మావోయిస్టుల కుట్ర దాగి ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. 2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అభిషేక్ పల్లవ నాలుగేళ్ల కిందట దంతేవాడ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. స్వతహాగా వైద్యుడైన అభిషేక్.. 2017 మార్చిలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పుల సందర్భంగా గాయపడిన ఓ నక్సలైట్‌కు ప్రాణదానం చేసిన వార్తల్లో నిలిచారు. ఎస్పీ అభిషేక్ తక్షణమే స్పందించి తీవ్రంగా గాయపడిన నక్సలైట్‌ను ప్రాణాపాయం నుంచి రక్షించాడు. దీంతో ఎస్పీ అభిషేక్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. పోలీసుల కాల్పుల్లో సోమరా అనే మావోయిస్ట్ పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లి తీవ్ర రక్తస్రావమైంది. ప్రాణాపాయంలో ఉన్న అతడిని చూసి చలించిపోయిన అభిషేక్ పల్లవ్ తాను పోలీస్ అధికారిని అనే విషయాన్ని పక్కనబెట్టి ఓ వైద్యుడిగా స్పందించాడు. సోమరా గాయానికి కట్టుకట్టి నొప్పి నివారణ ఔషధం ఇచ్చి, సమీపంలోని హాస్పిటల్‌కు అంబులెన్స్‌లో తరలించారు. దీనిపై అభిషేక్ మాట్లాడుతూ.. ఆ సమయంలో తాను ఓ వైద్యుడిలా ఆలోచించానని, ప్రాణాపాయంతో ఉన్న అతడికి చికిత్స చేశానని అన్నారు. అభిషేక్ పల్లవ్ తనను కాపాడినందుకు సోమరా కూడా రుణం తీర్చుకున్నాడు. నక్సలైట్ల గురించి కీలక సమాచారం అందజేసి పోలీసులకు సహకరించాడు. ఈ ఘటన తర్వాత 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దంతేవాడలో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లిన దూరదర్శన్ కెమెరాపర్సన్ అచ్యుతానంద సాహు, ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై ఎస్పీ అభిషేక్ పల్లవి కంటతడి పెట్టారు. సంఘటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎన్నికల కవరేజ్ కోసం గత పదిహేను రోజులుగా మీడియా సిబ్బంది మారుమూల గ్రామాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. అక్కడి ప్రజలను కలుసుకుని సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు. దీంతో కన్నెర్ర చేసిన నక్సలైట్లు ఇంత ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
By March 06, 2020 at 09:18AM
No comments