YSRP: ఎమ్మెల్యే విడదల రజినీ మరిది కారుపై దాడి, ఎంపీ వర్గీయుల పనేనా?
గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీలో వర్గ విబేధాలు భగ్గమంటున్నాయి. ఎమ్మెల్యే విడదల రజిని మరిది విడుదల గోపిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన వెళ్తున్న కారును వెంటాడిన దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా.. గోపీ గాయాలతో తప్పించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు విద్యుత్ ప్రభల ఏర్పాట్లు చూసి వస్తున్న సమయంలో.. ఎడవల్లి గ్రామ పరిధిలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ సంఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు రోజు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కారును ఎమ్మెల్యే రజినీ వర్గీయులు పురుషోత్తపట్నంలో అడ్డుకున్నారు. ఎంపీ సామాజికవర్గానికి చెందిన కొందరు.. ఈ సంఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు గోపి కారుపై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే బంధువు కారుపై దాడికి దిగారనే ప్రచారం కూడా తెర మీదకు రావడం గమనార్హం. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజినీ స్వగ్రామం పురుషోత్తమపట్నంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ ఊరేగింపునకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యే మరిది గోపీ ఆయన కారును అడ్డుకున్నారు. తమ విద్యుత్ ప్రభల వద్దకు ఆహ్వానిస్తే.. ఎంపీ రాకుండా తమ స్వగ్రామంలోనే మరొకరి విద్యుత్ ప్రభ ఊరేగింపునకు రావడం విడదల రజినీ వర్గంలో ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఆయన కాన్వాయ్‌ను అడ్డగించి దాడికి యత్నించారు. విడదల రజనీ వర్గీయులు.. ఎంపీ కారుపై చేతులతో గుద్దారు. ఇదిలా ఉండగా.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మర్రి రాజశేఖర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే రజినీ కొంతకాలంగా అసహనంతో ఉన్నారని సమాచారం. కొద్దిరోజులుగా ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు పెరిగాయని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. గతంలో ప్రోటోకాల్ విషయంలో కూడా ఇద్దరు నేతల మధ్య వివాదం తలెత్తగా తర్వాత సద్దుమణిగింది.
By February 21, 2020 at 09:44AM
No comments