Breaking News

జూన్ వరకూ గ్రే లిస్ట్‌లోనే పాక్.. అప్పటికీ టార్గెట్ పూర్తికాకుంటే బ్లాక్ లిస్ట్‌లోకి!


ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్ నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. పారిస్ వేదికగా జరుగుతోన్న ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో ఉగ్రవాదం నియంత్రణకు పాకిస్థాన్ తీసుకున్న చర్యలపై సంతృప్తి చెందాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే జూన్ వరకూ పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లోనే కొనసాగిస్తారు. అంతేకాదు, తాము రూపొందించిన 27 అంశాల కార్యాచరణను పూర్తిచేయలేకపోతే బ్లాక్ లిస్ట్‌లో చేర్చుతామని పాకిస్థాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరించినట్టు దౌత్యవర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదులకు నిధులు అరికట్టడంలోనూ, చర్యలు తీసుకోవడంలోనూ పాకిస్థాన్ విఫలమైనట్టు ఎఫ్ఏటీఎఫ్ అభిప్రాయపడింది. ఒకవేళ వచ్చే జూన్ నాటికి పాకిస్థాన్ వీటిపై సరైన చర్యలు తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. అంతేకాదు, ఎఫ్ఏటీఎఫ్ సభ్యదేశాలతో సమావేశం ఏర్పాటు చేసి పాకిస్థాన్‌తో వ్యాపార సంబంధాలు, లావాదేవీలపై ప్రత్యేక దృష్టిసారించాలని కోరతామని తెలిపింది. అక్టోబర్ 2019 సమావేశంలో ఇరాన్‌ను ఈ విధంగానే హెచ్చరించిన ఎఫ్ఏటీఎఫ్.. దానిని ప్రస్తుతం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఫిబ్రవరి 2020 సమావేశం నాటికి ఎఫ్ఏటీఎఫ్ కార్యాచరణలోని 27 అంశాలను చేరుకుని గ్రే లిస్ట్ నుంచి బయటపడతామని పాక్ హామీ ఇచ్చింది. బీజింగ్‌లో జరిగిన ఈ సమావేశంలో పాక్‌ను బ్లాక్ లిస్ట్‌లోకి చేరకుండా చైనా, మలేసియా, టర్కీ మద్దతుగా నిలిచాయి. అయితే, గ్రే లిస్ట్ నుంచి తప్పించుకోవాలంటే కనీసం 13 సభ్యదేశాలు ఆ దేశానికి మద్దతుగా నిలవాలి. ఈ దిశగా పాకిస్థాన్ లాబీయింగ్ చేసి మెజార్టీ దేశాలను ఒప్పించింది. కానీ, సాంకేతికంగా మాత్రం ఆధారాలు చూపడంలో విఫలమైంది. ఎఫ్ఏటీఎఫ్ సమావేశానికి కొద్ది రోజుల ముందే లష్కరే తొయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. గురువారం నాడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన పాక్.. ఎఫ్ఏటీఎఫ్ కార్యాచరణలో పేర్కొన విధంగా ఉగ్రవాద సంస్థల అగ్ర నేతలను అరెస్ట్ చేసి, విచారణ కొనసాగిస్తున్నామని తెలిపినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, కార్యాచరణలోని ఎనిమిది కీలక అంశాలపై తీసుకుంటున్న చర్యల గురించి ఎఫ్ఏటీఎఫ్ ప్రత్యేకంగా ప్రశ్నించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులను అడ్డుకోవడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. ఈ విషయంలో అధికారుల సహకారం ఎలా ఉంది.. సరిహద్దుల్లో అక్రమ నగదు రవాణాపై చర్యలు, ఉగ్రవాదులకు నిధులపై భద్రతా సంస్థల నిఘా తదితర అంశాలపై తమకు డెమో ఇవ్వాలని కోరింది.


By February 21, 2020 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-has-will-stay-on-the-fatf-grey-list-until-june-it-could-slip-into-the-blacklist/articleshow/74236107.cms

No comments