సమయం లైవ్ న్యూస్: మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం.. ఇక నుంచి అన్నీ ఆర్టీసీలోనే

⍟ రంగులు మార్చినంత సులువుకాదు: రాజధానిని విశాఖకు తరలించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిద్ధమైవేళ.. అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ప్రభుత్వం నిర్ణయంపై టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతులు చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపిన ఈ పార్టీలు.. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని ఉద్ఘాటించాయి. ⍟ టీడీపీలో మరో విషాదం: మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బడేటి కోట రామారావు(బుజ్జి) కన్నుమూశారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత బుజ్జికి గుండెపోటు రావడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఆయన మరణవార్త తెలుసుకొని టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు. బుజ్జి మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు, నేతలు సంతాపాన్ని తెలియజేశారు. ⍟ హీరో ప్లాంట్ నుంచి తొలి బైక్.. బాబు పిచ్చ హ్యాపీ: చిత్తూరులోని హీరో ప్లాంట్ నుంచి తయారైన తొలి బైక్ బయటకొచ్చేసింది. శ్రీసిటీ సమీపంలో నిర్మించిన ప్లాంట్ నుంచి మొదటి బైక్‌ను ఆవిష్కరించింది. క్రిస్మస్ రోజే బైక్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శంకుస్థాపన సమయంలో కంపెనీ మేనేజ్‌మెంట్ చెప్పినట్లుగానే 2019 డిసెంబరు సమయానికి తొలి వాహనాన్ని సిద్ధం చేసింది. ⍟ అన్నీ ఆర్టీసీ ద్వారా: ఆర్టీసీని లాభాల్లోకి మళ్లించే చర్యల్లో భాగంగా సరకు రవాణా చేపట్టాలని ఆదేశించిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా మరిన్ని సూచనలు చేశారు. ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్ ద్వారా అన్ని రకాల సరకులను రవాణా చేయాలని సూచించారు. బస్సులను కూడా అందుకు అనుగుణంగా రూపొందించాలని చెప్పారు. సరకు రవాణా కోసం ప్రజలు ఇప్పటిదాకా ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని.. ఆ పరిస్థితిని మార్చాలని ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
By December 26, 2019 at 09:03AM
No comments