సమయం లైవ్ న్యూస్: మూడు రాజధానులు ఆర్ధిక భారం.. బెల్ట్ షాపులు మూసేస్తే ఐదు లక్షలు

⍟ ముస్లిం ఇంటిపై జాతీయ జెండా: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని దారుస్సలాంలోని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ భారీ బహిరంగ సభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర లభించిన 70 ఏళ్ల తర్వాత భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎన్ఆర్సీ కల్పిస్తోందని అన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ⍟ మూడు రాజధానులు ఆర్ధిక భారం: మూడు రాజధానులు, నాలుగు ప్రాంతీయ మండళ్లు ఉండాలని సూచించిన జీఎన్ రావు కమిటీ నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆ ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము వ్యతిరేకం కాదని, ఆ పేరుతో రాజధానిని తరలిస్తే భూములిచ్చిన తమ పరిస్థితేంటని నిలదీస్తున్నారు. అటు ప్రతిపక్ష టీడీపీ కూడా జగన్ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ⍟ బెల్ట్ షాప్‌లు మూసేస్తే ఐదు లక్షలు: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని.. లిక్కర్ వల్లే నేరాలు మితిమీరుతున్నాయని కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బెల్టు షాపులను మూసేయించాలని పిలునిచ్చారు. ఈ క్రమంలో ఆసక్తికర ప్రకటన చేశారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రజలందరూ కలిసికట్టుగా బెల్టు షాపులను మూసేస్తే.. రూ. ఐదు లక్షల చొప్పున నజరానా ఇస్తానని ఆయన చెప్పారు. ⍟ అయ్యప్ప భక్తులు ధర్నా: కొచ్చీ వెళ్లాల్సిన ఓ విమానం అర్ధంతరంగా రద్దవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన 180 మంది అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లడానికి హైదరాబాద్ నుంచి కొచ్చీ వెళ్లే గో ఎయిర్ సంస్థకు చెందిన విమానానికి గాను టికెట్లు బుక్ చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి శనివారం మధ్యాహ్నం బయల్దేరి వెళ్లాల్సిన విమానం చివరి నిమిషంలో రద్దైనట్లు ప్రకటించింది.
By December 22, 2019 at 09:06AM
No comments