Breaking News

రూ.30లక్షల ఫార్చూనర్ కారు.. ముచ్చట తీరకుండానే కొట్టేశారు


ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేసిన కొత్త కారు 24 గంటల్లోనే చోరీకి గురైతే ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి కష్టమే వచ్చింది. సైదాబాద్‌ డివిజన్‌ జయనగర్‌ కాలనీలో నివాసముండే శ్రీనివాస్‌ (50) మైనింగ్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల మొదటి వారంలో ఆయన రూ.30లక్షలతో ఫార్చ్యూనర్ కారు కొన్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్‌ చేసి పడుకున్నాడు. శనివారం ఉదయం 11 గంటలకు బయటికి వచ్చి చూస్తే కారు జాడ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో వెంటనే సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ సురేశ్ దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఎంతో ఇష్టపడి కొన్న కారు కొద్దిరోజులకే చోరీకి గురి కావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.


By December 22, 2019 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/fortuner-car-theft-in-hyderabad-case-booked/articleshow/72921538.cms

No comments