Breaking News

రెండోసారి ల్యాండర్ కక్ష్య తగ్గింపు.. చంద్రుడికి మరింత దగ్గరగా విక్రమ్


చంద్రయాన్-2లో కీలకమైన ల్యాండర్ విడిపోయే ప్రక్రియ సోమవారం విజయవంతమైన విషయం తెలిసిందే. ఉపగ్రహం చంద్రుడికి 119 కి.మీ × 127 కిలోమీటర్ల కక్ష్యలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విడదీశారు. మంగళవారం ఉదయం 8.50 గంటలకు ల్యాండర్‌లోని చోదక వ్యవస్థను నాలుగు సెకన్ల పాటు మండించి దాని కక్ష్యను తగ్గించారు. తాజాగా, బుధవారం తెల్లవారుజామున మరోసారి కక్ష్య తగ్గింపును విజయవంతంగా పూర్తిచేశారు. బుధవారం తెల్లవారుజామున 3.42 గంటల ప్రాంతంలో ఈ ప్రక్రియను పూర్తిచేసినట్టు ఇస్రో వెల్లడించింది. ఇందుకోసం ల్యాండర్‌లోని చోదక వ్యవస్థను 9సెకన్లపాటు మండించినట్టు తెలిపింది. దీంతో చంద్రుడికి విక్రమ్‌ మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్‌ 35 కి.మీx 101 కి.మీ కక్ష్యలోనూ, ఆర్బిటర్‌ 96 కి.మీx 125కి.మీ కక్ష్యలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ల్యాండర్‌, ఆర్బిటర్‌ల పనితీరు సాధారణంగా ఉన్నట్లు ఇస్రో ప్రకటించింది. మిగిలిన రెండు రోజుల పాటు ల్యాండర్‌, రోవర్‌లోని వ్యవస్థల పనితీరును నిశితంగా పరిశీలించనున్నారు. సెప్టెంబరు 6న అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 నుంచి 2.30 గంటల మధ్య ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగనుంది. ఇది జరిగిన నాలుగు గంటల తర్వాత అందులో నుంచి రోవర్‌ బయటకు వస్తుంది. సెప్టెంబరు 7 తెల్లవారుజామున 1.40 గంటలకు ల్యాండర్‌ 35 కిలోమీటర్ల x 97 కిలోమీటర్ల మధ్య కక్ష్యలో ఉన్నప్పుడు దాని పరిమితిని పరిశీలించి, 1.55 గంటలకు ఉపరితలంపై దింపనున్నారు. ల్యాండర్ దిగిన నాలుగు గంటల తర్వాత రోవర్ బయటకు రానుంది. జులై 22న జీఎస్‌ఎల్వీ-మార్క్‌3ఎం1 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-2 కంపోజిట్‌ మాడ్యూల్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ రాకెట్‌ 16.33 నిమిషాలలో నిర్ణీత కక్ష్యలోకి చంద్రయాన్‌-2 మాడ్యూల్‌ను చేరవేసి తన విశ్వసనీయతను నిరూపించుకుంది. కాగా, ఇప్పటి వరకు చంద్రుడిపై అధ్యయనానికి అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఉపగ్రహాలను పంపాయి. తాజాగా, చంద్రయాన్-2 ప్రయోగంతో వాటి సరసన భారత్ నిలిచింది. అంతేకాదు, వీటికి భిన్నంగా పరిశోధనలకు దక్షిణ ధ్రువాన్ని ఎంపికచేసుకుంది. సూర్యకిరణాలు పడిన ఈ ప్రాంతం చీకటిగా ఉంటుంది. ఈ ఛాయా ప్రాంతంలో ఖనిజాలు, నీటి వనరులు ఉంటాయని భావిస్తున్నారు.


By September 04, 2019 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isro-comprising-vikram-lander-and-pragyan-rover-get-even-closer-to-moon/articleshow/70971443.cms

No comments