కేరళ: 113కి చేరిన వరద మృతులు.. మలప్పురంలో మరో 25 మంది మిస్సింగ్!

కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలకు మృతిచెందిన వారి సంఖ్య 113కు చేరుకోగా, ఇంకా 1.13 లక్షల మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వరదలకు అత్యధికంగా జిల్లాలో 50 మంది, కోజికోడ్‌లో 17 మంది, వాయనాడ్‌లో 12 మంది, కన్నూర్, త్రిసూర్‌లో 9 మంది, అలప్పూజలో ఆరుగురు, ఇడుక్కిలో ఐదుగురు, కొట్టయాం, కాసర్‌గడ్‌లో ఇద్దరు చొప్పున మృత్యువాతపడ్డారు. కేరళ వ్యాప్తంగా 805 సహాయక పునరావాస శిబిరాల్లో 41,253 కుటుంబాలకు చెందిన 1,29,517 మంది ఇంకా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వరదలకు మొత్తం 1,186 ఇల్లు పూర్తిగా నెలమట్టమయ్యాయని, 12,761 నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది వరదలకు కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం భారీగా ఉంది. శిధిలాల కింద చిక్కుకున్న వారికోసం రెస్క్యూ టీంలు గాలిస్తున్నారు. మలప్పురంలోని కావలప్పర, మెప్పడి, వాయనాడ్‌లోని పుతుమాలాలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. ఇక్కడ జీపీఎస్ సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కవలప్పరలో శుక్రవారం రెండు మృతదేహాలను వెలికితీయగా, మరో 25 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. ఇక్కడ మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో కొండచరియలు విరిగిపడినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు నిలిచిపోయినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేరళ రవాణా మంత్రి ఏకే శశీంద్రన్ స్పందించారు. జీపీఎస్ సాయంతో ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జేసీబీలో సాయంతో శిధిలాలను తొలగిస్తామన్ని మంత్రి వివరించారు. అయితే, ఇళ్ళు పూర్తిగా ధ్వంసమైన బాధితులకు పునరావాసం కల్పించే ప్రణాళికను ప్రభుత్వం ఇంత వరకు ప్రకటించలేదు. గతేడాది కూడా కేరళను భారీ వరదలు వణికించిన విషయం తెలిసిందే. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కేరళను 2018లో వరదలు ముంచెత్తడంతో 400 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 10 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. పర్యటానికి నెలవైన దేవభూమి వరదలకు కకావికలమైంది. అలప్పూజ లాంటి పర్యాటక ప్రదేశాలు కొన్ని రోజుల పాటు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. మొత్తం 1600 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
By August 18, 2019 at 11:33AM
No comments