Ukraine War సైనికుల మృతిపై తొలిసారి రష్యా ప్రకటన.. ఎంత మంది చనిపోయారంటే?
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది సైనికులు చనిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ సైనికుల మృతిపై రష్యా తొలిసారి ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌పై దాడుల ఘటనలో మొత్తం 498 మంది సైనికులు చనిపోయినట్లు రష్యా రక్షణమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉక్రెయిన్ మాత్రం 6 వేల మందికిపైగా రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ప్రకటించింది. అంతేకాదు, రష్యా దాడుల్లో తమ పౌరులు 2000 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం పేర్కొంది. ఉక్రెయిన్ దక్షిణ ప్రావిన్సుల రాజధాని, వ్యూహాత్మక రేవు నగరం ఖెర్సోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. దాదాపు 2.5 లక్షల జనాభా ఉన్న ఈ నగరం నీపర్ నది ఒడ్డున నల్ల సముద్రానికి సమీపంలో ఉంది. అయితే, రష్యా ప్రకటనను ఉక్రెయిన్ తొలుత కొట్టిపారేసింది. బుధవారం రాత్రి తర్వాత ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దురాక్రమణ ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే ఉద్దేశం తమకు లేదని.. కేవలం నిస్సైనీకరణ మాత్రమే తమ లక్ష్యమంటూ రష్యా చెబుతోంది. కానీ, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తోపాటు ప్రధాన నగరాలపై భీకర దాడులతో విరుచుకుపడుతోంది. అంతేకాకుండా కి.మీ మేర కాన్వాయ్‌తో కూడిన సైనిక బృందాలను ఉక్రెయిన్‌లోనికి తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తర్వాత రష్యా టార్గెట్ మాల్దోవా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా సైనిక చర్య క్రమాన్ని వివరిస్తూ బెలారస్ అధ్యక్షుడు చూపించిన కీలక మ్యాప్ రష్యా పన్నాగానికి బలాన్ని చేకూరుస్తోంది. అటు, ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) విచారణ ప్రారంభించిందని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీంఖాన్ చెప్పారు. ‘‘రష్యా యుద్ధంపై దర్యాప్తు చేయాలనే నా నిర్ణయాన్ని కొద్ది క్షణాల క్రితం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రెసిడెన్సీకి తెలియజేశాను.. సాక్ష్యాధారాల సేకరణతో మా పని ప్రారంభించాం’’ అని ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు పరిధిలో నేరాలను నిర్ధారించనున్నారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాలు రష్యా సైనిక చర్యను తీవ్రంగా ఖండించాయి. యుద్దానికి వ్యతిరేకంగా పలు దేశాలు మాస్కోపై ఆంక్షల ఒత్తిడిని పెంచాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించినా, ఇంకా కైవ్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టలేదు. ఈ సైనిక దాడిలో వేలాది మంది ప్రజలు మరణించారని, పలువురు గాయపడినట్లు ఐక్యరాజ్యసమితి అధికారులు తెలిపారు. అటు, రెండో దఫా చర్చలు గురువారం జరిగే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
By March 03, 2022 at 09:58AM
No comments