Breaking News

Ukraine War కీవ్‌‌లో భారత ఎంబసీ మూసివేత.. 26 విమానాల్లో భారతీయుల తరలింపు


ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియను కేంద్రం మరింత ముమ్మరం చేసింది. ఉక్రెయిన్‌లో భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భారత వైమానిక దళానికి చెందిన విమానాలను రంగంలోకి దింపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో భారతీయుల తరలింపునకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ఐఏఎఫ్‌ వెల్లడించింది. వాయుసేనకు చెందిన సీ-17 విమానాలను ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు పంపనున్నారు. ఐఏఎఫ్‌కి ఈ అతిపెద్ద రవాణా విమానాలు ఒక్కొక్కటి సుమారు 300 మందిని తరలించగలవు. ఉక్రెయిన్‌లో మానవ సహాయ చర్యల కోసం అవసరమైన సామగ్రిని తరలించడానికీ ప్రభుత్వం ఈ విమానాలనే వినియోగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, రాజధాని కీవ్‌లోని ఉన్న భారతీయ విద్యార్థులంతా ఆ నగరాన్ని వీడారని, అక్కడ ప్రస్తుతం భారతీయులెవరూ లేరని కేంద్రం తెలిపింది. అలాగే, కీవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్టు పేర్కొంది. పశ్చిమాన ఉన్న లీవ్‌‌లో తాత్కాలికంగా ఎంబసీని తెరవనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం మరిన్ని భీకర దాడులకు రష్యా పాల్పడొచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్తగా కీవ్‌లో రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్టు చెప్పాయి. నగరాన్ని భారతీయులు వీడటంతో ఖార్కీవ్‌లో ఉన్నవారిని క్షేమంగా ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులకు తరలించే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది. ఖార్కివ్ నుంచి రైళ్లు నడుస్తున్నా రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయా? అనేది పెద్ద ఆందోళన అని అక్కడ నుంచి భారత్ చేరుకున్న విద్యార్థులు పేర్కొన్నారు. ఖార్కీవ్‌లోనే రష్యా సైన్యం జరిపిన దాడిలో భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై వారి కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు వచ్చే మూడు రోజుల్లో 26 విమానాలను నడిపి అక్కడి వారిని తీసుకురానున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా వెల్లడించారు. ప్రధాని అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ‘ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయ విద్యార్థులున్నట్టు అంచనా వేయగా.. వీరిలో ఇప్పటి వరకూ 12 వేల మంది అంటే 60 శాతం మంది స్వదేశానికి చేరుకున్నారు.. మరో 8 వేల మంది రావాల్సి ఉండగా వీరిలో సగం మంది పలు మార్గాల ద్వారా స్వదేశానికి చేరుకుంటున్నారు.. మరో 4,000 మంది యుద్ధ ప్రభావిత జోన్‌లో ఉన్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం 4 గంటలకు రొమేనియాకు IAF C-17 విమానం బయల్దేరి వెళ్లింది.


By March 02, 2022 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-embassy-shuts-after-attempts-to-evacuate-students-from-kyiv-and-4000-still-in-war-zone/articleshow/89935460.cms

No comments