Breaking News

Ukraine crisis Live Updates హంగేరి నుంచి ఢిల్లీకి చేరిన ఎనిమిదో విమానం


ఉక్రెయిన్ నగరాలపై రష్యా సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని నగరం కీవ్‌ను స్వాధీనం చేసుకోడానికి రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఈ దాడుల్లో పలువురు ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఖర్కైవ్, కీవ్ నగరాల మధ్య ఉండే ఓ‌ఖ్‌త్యార్కా సైనిక స్థావరంపై రష్యా శతఘ్నుల జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపున కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 216 మందితో కూడిన ఎనిమిదో విమానం మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఈ విమానంలో వచ్చిన విద్యార్థులకు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలను నిరసిస్తూ యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ పరిస్థితులపై విచారణ ప్రారంభించినట్టు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ సోమవారం వెల్లడించారు. రష్యా సైనిక చర్యపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దురాక్రమణను వెంటనే నిలిపివేయాలంటూ అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆయా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తుండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెందిన ఓ లగ్జరీ విహార నౌక‌ను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. అంతేకాకుండా ఆ నౌకను ధ్వంసం చేసినట్లు పేర్కొనడంతోపాటు గమ్యం పేరును కూడా మార్చివేశారు. ఉక్రెయిన్‌కు యాంటీ ట్యాంక్ ఆయుధాలు, అప్ గ్రేడ్ మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తున్నట్టు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెల్లడించారు. రష్యా ముడి చమురు దిగుమతులను నిషేధించనున్నట్లు ట్రూడో పేర్కొన్నారు. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ వీరోచిత పోరాటానికి కెనడా మద్దతు కొనసాగిస్తుందని ట్రూడో పునురుద్ఘాటించారు. అంతర్జాతీయ బ్యాంకు చెల్లింపుల కోసం స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను తొలగించడాన్ని సమర్ధించడం సహా పలు ఆంక్షలకు కెనడా మద్దతు ఇచ్చింది. అమెరికా సైతం ఐక్యరాజ్యసమితిలో పనిచేసే 12 మంది రష్యా దౌత్యవేత్తలను తాజాగా అమెరికా బహిష్కరించింది. వారంతా తమ విధులకు అనుగుణంగా పనిచేయడంలేదని అమెరికా పేర్కొంది. ఐరాసలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా కూడా వీరిలో ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమెరికా వ్యవహరిస్తోందని నెబెంజియా విమర్శించారు.


By March 01, 2022 at 10:07AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/russia-ukraine-news-live-updates-russia-defends-at-un-general-assembly/articleshow/89914067.cms

No comments