Surya : చిరంజీవిగారే నాకు స్ఫూర్తి.. కంఫర్ట్ జోన్‌లో ఉంటే ఎదుగుదల ఉండదు: హీరో సూర్య
తమిళ హీరో అయినప్పటికీ గజినీ చిత్రంతో తెలుగు వారికి దగ్గరైన కథానాయకుడు సూర్య. కేవలం హీరోగానే కాదు.. మనసున్న మంచి వ్యక్తిగా సమాజానికి సేవ చేస్తున్నారు. అగరం ఫౌండేషన్‌ను స్టార్ట్ చేసి పేద విద్యార్థులకు చదువును అందిస్తున్నారు. తన స్వచ్ఛంద సంస్థ గురించి, దాన్ని ప్రారంభించడానికి ఎవరు స్ఫూర్తినిచ్చారనే విషయం గురించి సూర్య మాట్లాడారు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తెలుగు వారి హృదయాల్లోనూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారాయన. తెలుగు, తమిళ భాషల్లో ఆయన సినిమా ఏక కాలంలో విడుదలవుతుంటాయి. ఆయన తాజా చిత్రం ‘ఈటీ’. మార్చి 10న ఈ చిత్రం విడుదలవుతుంది. గురువారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో మాట్లాడుతూ ‘‘నేను ఆగరం ఫౌండేషన్‌ను స్థాపించాను. ఈరోజు నేను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ నాకు స్వచ్ఛంద సంస్థను ప్రారంభించడానికి ఇన్‌స్పిరేషన్ ఇచచింది మాత్రం చిరంజీవిగారే. రక్తదానానికి సంబంధించిన కొన్ని లక్షల మందిలో ఆయన మార్పును తీసుకొచ్చారు. అందులో కొంతైనా నేను చేయాలనిపించి ఆగరం ఫౌండేషన్‌ను స్టార్ట్ చేశాను. మా ఫౌండేషన్ నుంచి ఈరోజున 5వేల మంది తొలి తరం పిల్లలు కాలేజీకి వెళుతున్నారు. కంఫర్ట్ జోన్‌లో ఉండకూడదు. మనిషి అలా అనుకుంటే ఎదుగుదల ఉండదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే మార్పు ఉంటుంది. మన హృదయం ఏది చెబితే అది చేయండి. దాని కోసం కష్టపడండి. కరోనా సమయంలో అందరూ తమ చుట్టూ ఉన్న వారికి సాయపడ్డారు. అలాగే ముందుకు వెళదాం. అందరికీ మంచి భవిష్యత్తు ఉంది’’ అన్నారు. సూర్య ప్రారంభించిన అగరం ఫౌండేషన్, దాని సేవా కార్యక్రమాలను విమర్శించే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఆ విమర్శలను ఆయన దాటి ప్రజలకు మంచి చేయడానికి ముందుకు వెళుతున్నారు. ఓ వైపు హీరోగా మంచి విజయాలను సాధిస్తూ.. మరో వైపు సమాజానికి తన వంతు సేవను చేస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారు హీరో సూర్య.
By March 04, 2022 at 05:06AM
No comments