కోవిడ్ నాలుగో వేవ్ అంచనాను నమ్మలేం.. ఊహించి చెబుతున్నారన్న నిపుణులు
కోవిడ్ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లతో దేశం అతలాకుతలమైంది. ఆ సమయంలో భారీగా కరోనా కేసులు వెలుగు చూడడమే కాకుండా ఎంతోమంది మృత్యువాత పడ్డారు. దీంతో కొన్ని నెలల పాటు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ అన్ని మూతబడ్డాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. ఆస్పత్రిపాలైన వారి సంఖ్య తక్కువగా ఉన్నా లక్షల్లో కేసులు నమోదయ్యేవి. ఇప్పుడిప్పుడే దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో అధ్యయనం ఓ విషయాన్ని వెల్లడించింది. జూన్, జూలైలో కోవిడ్ ఉంటుందని తెలిపింది. జూన్ 22 నుంచి కరోనా నాలుగో వేవ్ మొదలవుతుందని, అక్టోబర్‌లో ముగుస్తుందని అంచనా వేసింది. దీంతో మళ్లీ అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ అంచనాపై కొంతమంది నిపుణులు పెదవి విరుస్తున్నారు. రెండు, మూడు వారాల్లో జరిగే విషయాలపై అంచనా వేస్తే నిజమయ్యే అవకాశం ఉంటుందని, దీర్ఘకాలిక అంచనాల్లో విశ్వసనీయత ఉండదని అంటున్నారు. పైగా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని కొట్టిపారేస్తున్నారు. పైగా అది డేటా ఆస్ట్రాలజీయే అవుతుంది తప్ప.. డేటా సైన్స్ కానే కాదని అభిప్రాయపడుతున్నారు. కాన్పూర్ ఐఐటీ నాలుగో వేవ్ అంచనాపై హర్యాణాలోని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ కూడా స్పందించారు. కొన్ని నెలల తర్వాత జరగబోయే విషయం ముందే చెప్పడం కేవలం ఊహగానం అవుతుందని, నమ్మలేం అని అన్నారు. అయితే ఐఐటీ కాన్ఫూర్ పరిశోధకులు మాత్రం తమ అంచనాను సమర్థించుకున్నారు. పలు అంశాలు, శాస్త్రీయ నమూనాల ఆధారంగానే చెబుతున్నామని తెలియజేశారు. జూన్ 22కు కొన్ని రోజులు అటుఇటుగా నాలుగో వేవ్ మొదలవుతుందని అన్నారు. ముందుగా చెప్పినట్టు ఆగస్ట్‌లో పీక్ స్టేజ్‌కు వెళ్తుందని, అక్టోబర్‌లో ముగుస్తుందని అంటున్నారు.
By March 06, 2022 at 11:05AM
No comments