Breaking News

రష్యా కొత్త చట్టం.. రిపోర్టింగ్ ఆపేసిన బీబీసీ, సీఎన్ఎన్ సహా అంతర్జాతీయ మీడియా


ఉక్రెయిన్‌పై సైనిక దాడి కొనసాగిస్తున్న రష్యా తమ సాయుధ బలగాలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని స్పష్టం చేసింది. సైన్యం గురించి అసత్య కథనాలు, వార్తలు వ్యాప్తి చేయడాన్ని క్రిమినల్‌ కేసుగా పరిగణిస్తూ జైలు శిక్ష విధించే చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిని రష్యా పార్లమెంటు శుక్రవారం ఆమోదించగా.. అధ్యక్షుడు పుతిన్ చట్టంపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆ దేశం నుంచి రిపోర్టింగ్‌ను నిలిపివేశాయి. బ్రిటన్ మీడియా తన సిబ్బందిని తాత్కాలికంగా రిపోర్టింగ్ నిలిపివేయాలని ఆదేశించింది. బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ దవై మాట్లాడుతూ.. స్వతంత్ర జర్నలిజం ప్రక్రియను నేరంగా పరిగణించేలా రష్యా కొత్త చట్టం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇటువంటి చట్టంతో రష్యాలోని బీబీసీ న్యూస్ జర్నలిస్ట్‌లు, సిబ్బంది పనిని తాత్కాలికంగా నిలిపివేయడం మినహా మాకు వేరే మార్గం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, బీబీసీ న్యూస్ సేవలు రష్యా బయట నుంచి కొనసాగుతాయని స్పష్టం చేశారు. జర్నలిస్ట్‌లను రష్యా నుంచి వెనక్కు పిలిచే ఉద్దేశం సంస్థకు లేదు కానీ, కొత్త చట్టం ప్రభావంపై పరిశీలిస్తున్నామని బీబీసీ ఇంటర్నెమ్ డైరెక్టర్ జొనాథన్ మున్రో అన్నారు. కెనడా బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పొరేషన్ (సీబీసీ) సైతం రష్యాలో క్షేత్రస్థాయి నుంచి తాత్కాలికంగా రిపోర్టింగ్ నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ చట్టంపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది. ‘ఈ చట్టం గురించి చాలా ఆందోళన చెందుతున్నాం.. ఉక్రెయిన్, రష్యాలో ప్రస్తుత పరిస్థితిపై స్వతంత్ర రిపోర్టింగ్‌ను నేరంగా పరిగణించేలా కనిపిస్తుంది’ అని సీబీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాకు చెందిన సీఎన్ఎన్, బ్లూమ్‌బర్గ్ సైతం రష్యాలోని తమ జర్నలిస్ట్‌లు తాత్కాలికంగా రిపోర్టింగ్ నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటికే రష్యా అధికారిక నెట్‌వర్క్ ఆర్టీకి చెందిన కంటెంట్‌ను పోస్ట్ చేయకుండా టెక్ దిగ్గజం గూగుల్.. సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ నిషేధించాయి. రష్యా నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబమాతో సహా పశ్చిమ దేశాధినేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమేనని దుయ్యబడుతున్నారు. కాగా, కొత్త చట్టం ప్రకారం సాయుధ దళాల గురించి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారికి జరిమానాలు, 15 ఏళ్లవరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు రష్యా పేర్కొంది. ‘రష్యా శత్రు దేశాలైన అమెరికాతో పాటు దాని మిత్రదేశాలు తమ దేశాన్ని విభజించేలా సైన్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. తద్వారా ప్రజల్లో అసమ్మతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి అసత్య వార్తలు తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు.. అందుకే ఈ తరహా వార్తలు ప్రచారం చేసేవారికి 15 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకువస్తున్నాం’ అని రష్యన్‌ పార్లమెంట్‌ దిగువసభ ఓ ప్రకటన విడుదల చేసింది. సాయుధ దళాలను అప్రతిష్టపాలు చేసే ప్రకటనలను అణిచి వేసేందుకు ఈ చట్టాన్ని రూపొందించినట్లు తెలిపింది.


By March 05, 2022 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/from-bbc-to-cnn-global-media-halts-reporting-in-russia-after-new-law-on-fake-news/articleshow/90005933.cms

No comments