Breaking News

రహస్య ప్రదేశానికి పుతిన్ కుంటుంబం.. అణు దాడిని తట్టుకునే బంకర్‌లో మకాం!


రష్యా- ఉక్రెయిన్‌ల యుద్ధం రోజు రోజుకూ ఉద్ధృతమవుతోంది. ఈ యుద్ధం ఎటువంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. రష్యా తీరును తీవ్రంగా ప్రపంచ దేశాలు ఆక్షేపిస్తున్నా.. ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఆంక్షలతో ఆర్థికంగా చక్ర బంధనం చేసినా ఐ డోంట్ కేర్ అంటున్నారు. ఓవైపు చర్చలకు ఆంగీకరిస్తూనే.. మరోవైపు ఉక్రెయిన్ నగరాలపై బాంబు దాడులను కొనసాగిస్తున్నారు. అణ్వాయుధ బలగాలను సిద్ధం చేయాలన్న పుతిన్ వ్యాఖ్యలతో యుద్ధం ఇప్పట్లో ఆపే అవకాశం లేదని అవగతమవుతోంది. యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న పుతిన్.. తన కుటుంబీకులందరినీ అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. అణ్వాయుధ దాడులు చేసినా అత్యంత సురక్షితంగా ఉండే బంకర్‌లోకి తన కుటుంబ సభ్యులందరినీ పుతిన్‌ పంపించారని బ్రిటన్‌కు చెందిన ఓ వార్త సంస్థ కథనం తెలిపింది. అణు యుద్ధం జరిగినా సురక్షితంగా ఉండేలా సైబీరియా ప్రాంతంలో అత్యాధునిక వసతులతో కూడిన బంకర్‌ని ఏర్పాటు చేయించారని కథనం తెలిపింది. అల్టయ్‌ పర్వత ప్రాంతంలో అల్టాయాస్కోయ్ పొడ్వరై రిసార్ట్‌లో ఈ బంకర్‌ను ఏర్పాటు చేశారని పేర్కొంది. అంతేకాదు, గత కొన్ని రోజులుగా పుతిన్‌ శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని సదరు మీడియా తెలియజేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల మద్ధతు పెరుగుతున్న నేపథ్యంలో పుతిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్‌కు తమ దేశంపై అణు దాడి జరగుందన్న అనుమానం ఉందా అన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రష్యా అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం వెనక అసలు కారణమేంటో కాలమే సమాధానం చెప్పాలి. మాస్కో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కు చెందిన ప్రొఫెసర్ వొలెరే సోలోవే మాట్లాడుతూ.. సైబీరియా ప్రాంతంలోని భూగర్భంలోని నగరానికి పుతిన్ కుటుంబం తరలివెళ్లిందని అన్నారు. పుతిన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు గతంలో సోలోవే ఆరోపించారు. పుతిన్ తన రక్షణ మంత్రి సెర్గీ షోయిగ్‌తో కలిసి విచిత్రమైన రహస్య ఆచారాలలో పాల్గొన్నారని కూడా అన్నారు. అయితే, చాలా మంది సోలోవేని కుట్ర సిద్ధాంతకర్తగా కొట్టిపారేస్తున్నారు. పుతిన్‌ ఆరోగ్యంపై విమర్శలు చేసినందుకు సోలోవేను గతవారం అదుపులోకి తీసుకుని ఏడు గంటల పాటు విచారించారు. సోలోవే ఇంటిపై దాడిచేసిన రష్యా పోలీసులు.. అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ వీడియోను విడుదల చేసిన సోలేవే ‘‘ఈ వారాంతంలో రష్యా అధ్యక్షుడు కుటుంబం ప్రత్యేక బంకర్‌లోకి వెళ్లింది.. ఇది అల్టాయ్ రిపబ్లిక్‌లో పర్వతాల వద్ద ఉంది.. వాస్తవంగా ఇది బంకర్ కాదు.. కానీ ఇది అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన ఓ భూగర్భ నగరం’’ అని అన్నారు.


By March 02, 2022 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/russian-president-vladimir-putin-has-moved-family-to-secret-siberian-nuclear-bunker/articleshow/89939241.cms

No comments