Breaking News

Ukraine Crisis ఐరాసలో రష్యాపై తీర్మానం.. భారత్, పాక్, చైనా సహా దూరంగా 35 దేశాలు


ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిలిపివేయాలని.. ఎటువంటి షరతుల్లేకుండా తక్షణమే పూర్తిగా సైనికులను ఆ దేశ సరిహద్దుల నుంచి ఉపసంహరించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ఐకత్య, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండాలని తీర్మానంలో డిమాండ్ చేశారు. ఈ తీర్మానంపై రెండు రోజుల పాటు చర్చ జరగ్గా.. బుధవారం ఓటింగ్ నిర్వహించారు. సాధారణ సభలోని మొత్తం 193 సభ్య దేశాలలో తీర్మానానికి అనుకూలంగా 141, వ్యతిరేకంగా 5 దేశాలు ఓటు వేశాయి. సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. గతం వారంలో రోజుల్లో రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాల్లో భారత్‌ వరుసగా మూడోసారి ఓటింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం. భారత్, పాకిస్థాన్, చైనా సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండి తటస్థ వైఖరిని ప్రదర్శించాయి. ఈ తీర్మానం న్యాయపరంగా చెల్లుబాటు కాకపోయినా.. రష్యా చర్యలను మూడింట రొండుంతుల సభ్య దేశాలు వ్యతిరేకించాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉండగా.. నేపాల్, మాల్దీవులు, భూటాన్, అఫ్గనిస్థాన్‌లు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. ఎరిత్రియా, బెలారస్, ఉత్తర కొరియా, సిరియాలు వ్యతిరేకంగా ఓటువేయడం విశేషం. ఐరాస భద్రత మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలను రష్యా తన వీటో అధికారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ తీర్మానాలపై ఓటింగ్‌కు కూడా భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్, రష్యాలు చర్చల ద్వారా సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని భారత్ ముందు నుంచి చెబుతోంది. ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.. సంఘర్షణ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ముఖ్యంగా ఖార్కివ్‌తో సహా భారతీయులందరికీ సురక్షితమైన, అంతరాయం లేని మార్గాన్ని అందించాలని డిమాండ్ చేశారు. వారిని సురక్షితంగా తీసుకురావడం భారత్ ప్రధాన ప్రాధాన్యత అని అన్నారు. ఖార్కివ్‌లో మరణించిన భారతీయ విద్యార్థి, ప్రాణాలు కోల్పోయిన పౌరులందరికీ ఆయన సంతాపాన్ని తెలియజేశారు. తక్షణమే కాల్పుల విరమణ, సంఘర్షణ ప్రాంతాలకు సురక్షితమైన మానవతా సాయం కోసం అంతర్జాతీయ సమాజం పిలుపునకు భారత్ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యమే సమస్యకు పరిష్కారమని తిరుమూర్తి పునరుద్ఘాటించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో దఫా చర్చలు సానుకూల ఫలితానికి దారితీస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరాస చార్టర్, అంతర్జాతీయ చట్టం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత సూత్రాలను తప్పనిసరిగా గౌరవించాలనే భారతదేశ వైఖరిని మరోసారి నొక్కిచెప్పారు. ‘‘చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే విభేదాలు పరిష్కరిచుకోవచ్చనే మా నమ్మకాలపై మేము దృఢంగా ఉంటాం... రష్యా, ఉక్రెయిన్‌ సహా ప్రపంచ నేతలతో జరిపిన చర్చల్లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా తెలియజేశారు.. యుద్ధంలో చిక్కుకున్న పౌరుల మానవతా సాయం, కదలిక కోసం తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు.. రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో దఫా చర్చలు సానుకూల ఫలితానికి దారితీస్తాయని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.


By March 03, 2022 at 07:43AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/india-pakistan-china-among-35-nations-to-abstain-from-voting-on-anti-russia-resolution/articleshow/89958720.cms

No comments