Breaking News

పుతిన్ ఓ నియంత.. రష్యా బాంబులకు ఎదురొడ్డుతున్న ఉక్రెనియన్లకు సెల్యూల్: జో బైడెన్


ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు నియంతంతో పోల్చారు. మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్.. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం గురించి మాట్లాడారు. రాజధాని కీవ్‌ను చుట్టుముట్టి యుద్ధ ట్యాంకులతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దాడిచేస్తున్నారని మండిపడ్డారు. ఉక్రెయిన్‌ ప్రజల హృదయాలను ఆయన ఎప్పటికీ పొందలేరని వ్యాఖ్యానించారు. పుతిన్‌ ఓ నియంత అన్న బైడెన్.. అమెరికా గగనతలంలో రష్యా విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ‘‘రష్యా ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తాం.. ఉక్రెయిన్‌ ప్రజలతో అమెరికా ఉంది. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు నాటోలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటాయి.. యుద్ధ రంగంలో పుతిన్‌ లాభపడొచ్చు. కానీ.. దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించక తప్పదు’’ అని బైడెన్‌ హెచ్చరించారు. రష్యా చేస్తున్న దాడులు ఉక్రెయిన్కు పరిమితం కావని.. భవిష్యత్తులో ఇతర దేశాలపై కూడా దాడిని కొనసాగిస్తుందని బైడెన్ అన్నారు. ‘‘చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకున్నాం.. నియంతలను కట్టడి చేయకపోతే వారు మరింత విధ్వంసం సృష్టిస్తారు.. వాళ్ల దాడులను విస్తరిస్తారు.. ఈ క్రమంలో అమెరికా సహా ప్రపంచ దేశాలకు ముప్పుకు గురయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయి.. అందుకే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో కూటమిని ఏర్పాటు చేశాం’’ అని పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతోనే ఈ యుద్ధాన్ని పుతిన్ ప్రారంభించారని బైడెన్ ఆరోపించారు. ‘‘ పాశ్చాత్య దేశాలు, నాటో ఈ దాడులకు స్పందించవని పుతిన్ భావించారు.. కానీ పుతిన్ అంచనా తప్పు.. మేము ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని పరోక్షంగా యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. మరోవైపు, రష్యా సైనిక దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌కు 3 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ఇవ్వనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ ప్యాకేజీలో 350 మిలియన్ డాలర్లను తక్షణం విడుదల చేయాలని వరల్డ్ బ్యాంకు నిర్ణయించింది. ఉక్రెయిన్‌లోని నివాస భవనాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. రష్యా దాడి తర్వాత 6,77,000 మంది పౌరులు ఉక్రెయిన్ విడిచి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి యొక్క శరణార్థి ఏజెన్సీ తెలిపింది.


By March 02, 2022 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-joe-biden-salutes-ukraine-for-wall-of-strength-as-russia-bombs/articleshow/89938174.cms

No comments