తమిళనాడు మంత్రి కుమార్తె ప్రేమ పెళ్లి.. కర్ణాటక హోం మంత్రి కీలక ప్రకటన!
తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పీఎస్ శేఖర్‌బాబు కుమార్తె డాక్టర్ జయకళ్యాణి (24) పెద్దలను ఎదురించి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయిన జయకళ్యాణి.. కర్ణాటకలోని రాయచూర్ హలస్వామి మఠంలో తాను ప్రేమించి సతీశ్‌ను సోమవారం వివాహం చేసుకుంది. అయితే తండ్రి నుంచి తనకు, తన భర్తకు ప్రాణ హాని ఉందని బెంగళూరు సిటీ కమిషనర్ కమల పంత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరింది. తాజాగా, ఈ జంట గురువారం కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిశారు. ప్రేమించి వివాహం చేసుకున్న తమకు తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని జ్ఞానేంద్రకు డాక్టర్ జయకళ్యాణి వినతిపత్రాన్ని అందజేశారు. కన్నడ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులతో వెళ్లిన వీళ్లు హోంమంత్రిని కలుసుకున్నారు. తాము ఇప్పటికే బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌కు వినతిపత్రాన్ని అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. భద్రత విషయమై చర్యలు తీసుకుంటామని నూతన దంపతులకు హోం మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ కమల్ పంత్‌కు హోం మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త దంపతులకు రక్షణ కల్పించాలని సూచించింది. ‘‘ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్‌గా పరిచయం చేసుకున్న జయకళ్యాణి పరస్పర అంగీకారంతో సతీష్‌తో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.. తన భర్తపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, అందుకే తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం మంత్రి నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్‌తో మాట్లాడారు’’ అని ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ కార్యాలయం తెలిపింది. బెంగళూరు సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం, వారు అజ్ఞాత ప్రదేశంలో నివసిస్తున్నారని, అవసరమైనప్పుడు పోలీసుల సహాయం చేస్తారని తెలిపారు. హోం మంత్రిని కలిసిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాతో డాక్టర్ జయకళ్యాణి మాట్లాడారు. తాము ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని హోం మంత్రి, బెంగళూరు సీపీని కలిసి ఇదే విషయం చెప్పామని అన్నారు. నా భర్తపై తప్పుడు కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. ఇక్కడ మా ఇద్దరం ఏం చేయగలమో అది చేస్తామని, సమీప భవిష్యత్తుల్లో తమిళనాడుకు వెళ్లబోమని స్పష్టం చేశారు. అంతేకాదు, గతేడాది సెప్టెంబరులో తమకు వివాహం జరిగిందని చెప్పడం గమనార్హం. సతీశ్‌ను ప్రేమించడం తమ తల్లిదండ్రులకు నచ్చలేదని, కొద్ది నెలల కిందట పెళ్లి చేసుకోడానికి ప్రయత్నించినప్పుడు సతీశ్‌పై తమిళనాడు పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి రెండు నెలలు నిర్బంధించారని చెప్పారు. గతేడాది జనవరిలో తమ ప్రేమ వ్యవహారం గురించి తల్లిదండ్రులకు తెలిసిందని, దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో బెంగళూరుకు వచ్చేసినట్టు జయకళ్యాణి పేర్కొన్నారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు మంత్రి శేఖర్ ఫిర్యాదు చేశాడు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో మంత్రి కూతురి కిడ్నాప్ వ్యవహారం మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు తమిళనాడు మొత్తం గాలించగా.. పక్క రాష్ట్రంలో ఈ జంట ప్రత్యక్షం కావడం గమనార్హం.
By March 11, 2022 at 10:34AM
No comments